mahivishnupriya

నా భావాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం

దుర్గమ్మ…

బస్ లో వస్తుంటే దుర్గమ్మ గుడి ముందు బస్ ఆగింది.రోజూ లాగానే అమ్మ వారిని చూసి అప్రయత్నంగా కళ్ళు మూసుకునే లోపు “అమ్మా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ” అన్న పిలుపుతో ఇటు వైపు తిరిగి ఎవరూ లేరు అని చెప్తూ ఆమె కూర్చోవటానికి వీలుగా పక్కనే సీట్ లో ఉన్న బ్యాగ్ ఒడిలోకి తీసుకున్నాను.అలా కాసేపు అటూ ఇటూ చూస్తూ ఆమె పాదాలు అనుకోకుండా చూశాను.పసుపు రంగులో మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్నాయి.పసుపు అందరికీ అంత చక్కగా నప్పదు.కాసేపయ్యాక మీరు ఉద్యోగం చేస్తారా అని అడిగారు అవునని చెప్పాక కాసేపు మౌనం తరువాత ఏదో ఒకటి మాట్లాడాలనిపించింది. మీది ఏ ఊరు ఇక్కడేనా అనగానే మాది బొబ్బిలి దగ్గర పల్లెటూరమ్మా.నేను హైదరాబాదులో ఒకరింట్లో పని చేస్తానమ్మా.ఆలింట్లో సారు మేడమ్ము ఇద్దరూ ఉజ్జోగాలికెలిపోయాక సారు గారి అమ్మ గారిని సూసుకుంటానమ్మా.ఆ పెద్దమ్మ గోరు మంచానే ఉంటారమ్మా ఆయమ్మ గారికి అన్ని పనులు,ఇంట్లో అన్ని పనులు సేస్తానమ్మా.రెండు నెలలకొకసారి ఆళ్ళే జీతం లో డబ్బులు కాకుండా ట్రైన్ టికెట్లు కొని ఇంటికి పంపిస్తారమ్మా.ఆళ్ళు చాలా మంచోళ్ళమ్మా.నెలకి ఇరవై మూడు వేలిత్తారమ్మా.ఇటు పక్క అంత జీతాలివ్వరు కదమ్మా.మా యజమాని ఇంట్లోనే ఉంటాడమ్మా అప్పట్లో ఎక్కువ తాగీసీవోడు అందుకే ఒంట్లో బాగోదు మా అత్త సూసుకుంటాది.ఆయనకి ఒంట్లో బాగులేనపుడు,ఇళ్ళు కట్టడానికి సేసిన అప్పు పన్నెండు లచ్చలుందమ్మా దానికి వడ్డీ పెరిగిపోతంది అందుకే అంత దూరమెళ్లి పని సేయడం.

ఒక పూల కొట్టు ముందు ఒకామె దాదాపు పదేళ్ళ కూతురి జడలో పూలు పెడుతుండటం చూసి నా కూతురికి కూడా పువ్వులు చాలా ఇష్టమమ్మా నా కూతురు పదో తరగతి సదువుతుందమ్మా చాలా బాగా సదువుతాదమ్మా.దాన్ని సదివిస్తానమ్మా ఏదో చిన్న ఉజ్జోగం వచ్చినా చాలు నాలాగ ఇలా ఇంటి పనులు సేసుకోకుండా ఉంటే చాలు.

ఇలా ఆపకుండా మాట్లాడుతూ ఒక్కసారిగా మౌనంగా అయిపోయారు.కాసేపటి తరువాత నా కూతురికి నా కంటే ఆళ్ళ నాన్నంటేనే ఇష్టం.ఆళ్ళ నాన్న ఇంట్లోనే ఉండి దాన్ని జాగ్రత్తగా సూసుకుంటాడట నేను దాన్ని వదిలి ఊరు ఎళ్లిపోతానని నేనంటే అంత ఇష్టం ఉండదు.ఈ మాట వినగానే నా కొడుకు రెండేళ్ళ వయసులో ఒకరోజు అమ్మా నువ్వు మంచి కాదు నాన్నే మంచి.ఆపీసు నుంచి వేగమొచ్చేస్తాడు అన్న మాట గుర్తొచ్చింది.వాళ్ళ నాన్న ఉద్యోగం లో ఉన్న కొన్ని సౌకర్యాలు వాళ్ళ అమ్మ ఉద్యోగంలో ఉండవని అర్ధమయ్యే వయసు కాదు వాడిది.

అయినా ఆళ్ళ నాన్నకి కూడా అదంటే ప్రాణమేనమ్మా.అది పెద్దదయ్యేకొద్దీ తాగుడు మానేసాడమ్మా ఆమె ఇంకా చెప్తుంది.ఒకసారిగా తన చెయ్యి పట్టుకుని అంతా బాగుంటుంది ఏం బాధపడకు అన్నాను.అమ్మా నీ నోటి చలవ వల్ల అలాగ జరిగితే ఇంకేటి కావాలమ్మా అన్నారు.అమ్మా ఏమీ అనుకోకపోతే నా ఫోన్ నెంబరు మీకిస్తాను మీకు తెలిసినోలెవరింట్లోనైనా ఇలా పెద్దోళ్ళని సూసుకునే పని ఉంటే ఫోన్ సేయండమ్మా.పదిహేడు వేలు అలా ఇచ్చేట్లయితే వచ్చేత్తానమ్మా పిల్లకి దూరంగా ఉండటం కష్టంగా ఉంది అని ఫోన్ నెంబరు ఇచ్చి కాంప్లెక్స్ లో నవ్వుతూ చెయ్యి ఊపి వెళ్ళి పోయింది.ఇంతలో మాధురి ఫోన్ చేసింది రీజనల్ ఆఫీస్ లో women’s day celebrations కి ఎందుకు రాలేదు ఎప్పుడూ బ్యాంక్ ఇల్లు ఈ రెండింటి మధ్య లో ఇంకేమీ ఉండవా అని.మాధురి చెప్తున్నదేదీ బుర్రలోకి ఇంకట్లేదు ఇందాక బస్ లో మాట్లాడినామె పేరు ఏమై ఉంటుందా అన్న ఆలోచనలో.

2 Comments »

ధనుంజయ్

ధనుంజయ్….ఇంటర్మీడియట్,ఇంజనీరింగ్ టాపర్.సన్నటి పిల్లాడు.మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో ఓటు వేయటానికి వెళ్లినపుడు ఖద్దరు చొక్కా వేసుకుని ఊరిలో హడావుడి గా తిరుగుతున్నాడు లావుగా వయసుకు మించిన బరువుతో.నన్ను చూసి జీవం లేని ఒక చిరునవ్వు.తను ప్రేమించిన అమ్మాయి నాకు తెలుసు.అందమైన,నెమ్మదైన,తెలివైన అమ్మాయి.వీళ్లిద్దరినీ రోజూ దగ్గర నుంచి చూసే వాళ్ళకి కూడా వీళ్లు ప్రేమలో ఉన్నట్లు తెలియనంత హుందాగా,బాధ్యతగా ఉండేది వీళ్ల  ప్రవర్తన.ధనుంజయ్ తో పెళ్ళి కోసం దాదాపు తొమ్మిదేళ్ళు ఇంట్లో నచ్చచెప్పుకుని ఎదురుచూసింది ఆ అమ్మాయి.ధనుంజయ్ వాళ్ళ నాన్న గారు సంవత్సరం ముందు అకస్మాత్తుగా చనిపోవటంతో ఇంటి బాధ్యత వీడిపై పడింది.వాళ్ళ నాన్న గారి తరువాత ఈ రాజకీయాల్లోకి వీడు రావాల్సి వచ్చింది.వీళ్ల ఇంట్లో బాధ్యతలన్నీ తీరే వరకు వేచి చూసే సహనం ఆ అమ్మాయి కుటుంబానికి లేక పోయింది. ఇద్దరి కుటుంబాలని ఒప్పించి వాళ్ళ ఇష్టంతోనే పెళ్ళి చేసుకోవాలనుకున్న ఇద్దరూ ఆ ప్రయత్నంలో ఓడిపోయి మౌనంగా దూరమయ్యారు.ఒకప్పుడు సున్నితమైన మనసున్న మహేంద్ర ఇప్పుడు ఊరి గొడవల్లో ముందుండే రాజకీయ నాయకుడు.ఇంట్లో పిన్నితో మాట్లాడుతుంటే బయట వరండాలో చిన్నాన్న దగ్గర కూర్చుని ఊర్లో ఎవరిదో గొడవ గురించి చెప్తున్నాడు.ఆ గొంతులో ఎంత కోపం,ఏదో తెగింపు.వాడి గురించి తెలిసిన వాళ్ళు వాడినిలా చూసి నమ్మలేరు.నేను వచ్చానని చిన్నాన్న చెప్పినట్లున్నారు లోపలకి వచ్చాడు మళ్లీ అదే జీవం లేని నవ్వు.వాడి మాటల కంటే మౌనమే వాడి బాధ నాకు అర్ధమయ్యేలా చేసింది.వాడి విషయంలో ఇలా జరగకుండా ఉండాల్సింది.

1 Comment »

మహాలక్ష్మి మామ్మ

ఎన్నాళ్ళ తరువాత ఇలా కూర్చోగలగటం.మౌనంగా…..ఎన్ని ఆలోచనలు,ఙాపకాలు… కన్నీళ్ళు తెప్పించేవి,సేద తీర్చేవి,భద్రంగా దాచుకోవాలనిపించేవి.

                         మహాలక్ష్మి మామ్మ చనిపోయింది నాలుగు నెలల క్రితం.రాలేకపోయాను.తనతో నాకు చుట్టరికం చెప్పమంటే తాత గారి చెల్లెలి కోడలు…కొంచెం దూరం చుట్టరికమే అనిపిస్తుంది కదా .కానీ రాళ్ల ముక్కుపుడక మెరుస్తుండగా తన నవ్వు నేను కళ్లు మూసుకోగానే సజీవంగా కనిపిస్తుంది.ఇంటి మధ్యలో దానిమ్మ చెట్టు,చెట్టు చుట్టూ గుండ్రని చిన్న అరుగు,ఇటు వైపు పన్నెండు మెట్లు,అటు వైపు వంట చేసుకునే పంచ,దాని వెనకే గిలక బావి,దాని చుట్టూ పెద్ద చెట్లు,ఇటు వైపు మెట్లు ఎక్కి పైకి రాగానే ఇనుప ఊచల తలుపు,తరువాత చిన్న వసారా,ఒక మూలగా చిన్న,అందమైన దేవుడి గది,వసారా ముందు పక్కపక్కన రెండు గదులు,ఎడమ వైపు గదిలో గుండ్రని అద్దాన్ని తలుపులో ఇముడ్చుకున్న చెక్క బీరువా.ఇంటి ముందు తులసి మొక్క,విరజాజి పందిరి,రాధామనోహరాల మొక్క.మహాలక్ష్మి మామ్మ….మామ్మ పేరు నాకు తెలీదు…నా భాషలో మామ్మ పేరు గుమ్మాన మామ్మ,తాత గారి పేరు ఇప్పటికీ తెలియదు.మా ఇంటి గుమ్మం లో వాళ్ళ ఇళ్లు.అందుకే గుమ్మాన మామ్మ,తాతయ్య.గిలక బావి చుట్టూ ఉన్న చెట్ల సందుల్లోంచి వచ్చే ఎండతో దాగుడుమూతలాట,మెట్ల మీద గెంతుతూ ఆడుకునే ఆట,బీరువా తలుపు అద్దంలో మొన్నమొన్నటి వరకు నన్ను నేను ఇష్టంగా చూసుకోవటం,ఇంటి ముందు విరజాజి పూవుల వాసన ఇవన్నీ ఎంత ఇష్టమో మామ్మ అంటే అంత ఇష్టం.మెట్ల పై చిన్న గౌను వేసుకున్న పాప,స్వచ్ఛమైన నవ్వున్న మామ్మ మాట్లాడుతూ వాళ్ళ వయసును మరచి నవ్వుకునే స్నేహం ఎంత అందంగా ఉంటుందో.అసలు ఆ దానిమ్మ చెట్టు,ఆ మెట్లు,ఆ దేవుడి గదిలో ధూపం మధ్యలో చల్లగా నవ్వే మామ్మ,ఆ ఇళ్లు అది చివరి శ్వాస వరకు మరచిపోకూడదనుకునే అత్యంత అపురూపమైన విషయం.బొమ్మలేసే విద్య నాకు రాదు ఆ దృశ్యం భద్రపరచుకోవటానికి.నా మురారి మామ్మ ఇంట్లో మెట్ల మీద ఆడుకుంటుంటే గోరుముద్దలు తినిపించాలనే కోరిక తీరలేదు.మెట్ల పై కూర్చుని మాటల్లో వ్యక్తం చేయలేని బెంగని దానిమ్మ చెట్టు తో మౌనంగా చెప్పుకుందామంటే ఇంటికి తాళం……ఊరిలో ఇంకో అందమైన ఇంటికి తాళం.పల్లెల్లో విశాలమైన ఇళ్లకి తాళాలు పడిపోతున్నాయి పట్టణాల్లో గాల్లో కట్టిన మేడలు కోట్లు పెట్టి కొనుక్కుంటున్నాం.

                                        

2 Comments »

పద్మనాభం

పద్మనాభం వెళ్లాల్సి ఉంది ఓ మూడు రోజులు ఈ విషయం తెలియగానే కుంతీమాధవాచార్యుల కుటుంబం నడచిన నేల మీద అడుగుపెట్టబోతున్నానన్న ఉద్వేగం మనసును కమ్మేసింది.కొండ మీద గుడికి వెళ్లగలిగే అదృష్టం ఉందా లేేదా అనే బెంగ నిద్రపోనివ్వలేదు.వేేకువఝాముున ఇంట్లో పూజ చేేస్తున్నపుడు గొంతు విష్ణు సహస్ర నామాలను వల్లె వేస్తున్నా మనసు పద్మనాభం  కుంతీమాధవుని దగ్గర కూర్చుండిపోయింది.పూజ చివరలో మనసు  కొండపైకి వెళ్లగలిగే అదృష్టం కల్పించమని స్వామిని ఆర్తిగా వేడుకుంది.తగరపువలసలో బస్ దిగి ఆటోలో వెెెళ్తుంటే మధ్యలో వచ్చే మజ్జివలస,కురపల్లి ఈ పేర్లు చదువుతుంటే ఇక్కడి నుంచే కదా ఆచార్యులవారి దగ్గరకి వైద్యానికి వచ్చేవారు అనుకున్నాను.కురపల్లి దాటాక దూరాన కొండ మీదకి మెట్లు,గుడి కనిపించాయి ఎంత ఇష్టంగా చూసుకున్నానో.మొదటి రోజు సాయంత్రానికి కుంతీమాధవ స్వామి ఆలయం లోకి వెళ్లగలిగాను.పూజారి గారు లేరు.విశాలమైన ఆలయప్రాంగణం,రామ చిలకలు మంత్రాలు చదువుతూ ప్రదక్షిణ చేస్తున్నట్లు గోపురం చుట్టూ కిిలకిలలాడుతూ ఎగురుతున్నాయి.సుభద్రాచార్యుల వారు,బుల్లిరాజు గారు ఆడుకున్న ఆలయ ప్రాంగణం ఇదే కదూ.బయటకి వస్తుంటే ఫాల్గుణ శుద్ధ ఏకాదశి కళ్యాణోత్సవాల బోర్డ్ ఒకటి కనిపించింది.ఈ కళ్యాణోత్సవాల సమయంలోనే కదూ సుభద్రాచార్యులు,వరదమ్మల పెళ్లి జరిగింది.గుడి బయటకు వచ్చి కొంచెెం ముందుకు వెెళ్తే కొండపై గుడికి మెట్ల దారి,1200 పైబడి మెట్లు.అప్పుడు మెట్లపై నుంచి వెళ్లలేనని తెలిసినా కొన్ని మెట్లు ఎక్కి దిగి సంతోషపడిపోయాను.మెట్లు కాకుండా వాహనాలు వెళ్లే దారి ఉందమ్మా అని నాతో వచ్చిన రాము గారు చెెప్పారు.రేపు నన్ను తీసుకు వెళ్లటం కుదురుతుందా అని అడిగితే అలాగే అన్నారు.రెండవ రోజు టూవీలర్ పై కొండ పైన ఉన్న పద్మనాభ స్వామి గుడికి తీసుకు వెళ్లారు.కొండ పైకి వెళ్లే దారి మొత్తం రాళ్లు.డ్రైవింగ్ లో బాగా అనుభవం లేేేకపోతే ప్రయాణం కొంచెం ప్రమాదమే.అప్పటిికే అక్కడ పూజారిగారు పూజ ముగించుకుని క్రిింద ఊరిలోకి వెళ్లిపోయారంట.మెట్లదారిలో వచ్చిన వాళ్లు బయట పూజ చేస్తున్నారు.నిశ్శబ్ధంగా,ప్రశాంతంగా ఉంది.క్రిందకి చూస్తే గోస్తనీ నది,పచ్చని పొలాలు అందమైన పెయింటింగ్ లా ఉంది.రెండో పంటగా వరి పండుతుంది.అక్కడి నుంచి ఫోన్ చేసి కృష్ణతో చెప్పాను ఎప్పుడైనా మెట్ల దారిలో ఇక్కడకి వద్దాం అని.మూడో రోజు పద్మనాభంలో చివరి రోజు.ఇంటి వెెనుక పూల మార్కెట్లో పార్వతమ్మ దగ్గర పూలు,తులసి మాల తీసుకుని వెళ్లాను.ఎవరినీ తోడు తీసుకుని వెళ్లకుండా ఒక్క దాన్నే కుంతీమాధవ స్వామి గుడికి వెెెళ్లాను.పూజారి గారు పూజ చేసిన తరువాత కమ్మని పొంగలి ప్రసాదం ఇచ్చారు.రుక్మిణమ్మ పొంగలి గుర్తు చేేసుకున్నాను.కార్తీక మాసం అమావాస్య రాత్రి కొండ దారంతా దీపాలు వెలిగిస్తారంట.”మీకు సుభద్రాచార్యులు గారు తెలుసా?”అనే ప్రశ్న అడగకుండా ఉండటం చాలా కష్టమైంది.చాలా సేపు గుడి మొత్తం తిరిగి వచ్చేస్తుంటే సాయంకాలమైంది చదివినపుడు కలిగిన దిగులు మనసును కమ్మేసింది.ఆ కధ కల్పితం అన్న స్పృహ ఉండదెందుకో.

                                           సాయంత్రం ఇంటికి వెళ్తుంటే పూల మార్కెట్ లో పార్వతమ్మ కనిపించి అడిగింది ఉదయం గుడికి వెళ్లినట్లున్నారని,పద్మనాభం వెళ్లానని చెప్తే చాలా సంతోషపడిపోయింది వాళ్ల అమ్మగారి ఊరు కురపల్లి అని చెప్పి.

6 Comments »

బంగారు తల్లి ఇల్లేరమ్మ

బయట వర్షం పడుతున్న మధ్యాహ్నం,వర్షపు హోరుకు చీకటి కమ్ముకున్న సమయంలో ఎప్పడూ వెచ్చగా బజ్జోవాలనిపించేది.కానీ ఆ పెద్ద మనిషి ఇల్లేరమ్మ ఈ లోకంలో పెత్తనాలు ముగించుకుని వెళ్లిపోయారనే విషయం నిద్ర రానివ్వటం లేదు.ఇంతగా ఇష్టపడే ఇల్లేరమ్మ గురించి నాకు తోచిన రెండు ముక్కలు వ్రాసుకోవాలనిపించింది.ఆమెని డాక్టర్.సోమరాజు సుశీల గారు అనుకోవటం కంటే ఇల్లేరమ్మగా గుర్తు పెట్టుకోవటమే ఇష్టం.ఆ మధ్య ఆమె చదువు గురించి తెలుసుకున్నాక కృష్ణతో ఇల్లేరమ్మ కూడా మన లాగానే కెమిస్ట్రీ స్టూడెంటట అని మురిపెంగా చెప్పుకున్నాను.మనసారా హాయిగా నవ్వుకోవాలనుకున్నపుడు భానుమతి గారి అత్తగారు,ముళ్లపూడి గారి బుడుగు,ఈ ఇల్లేరమ్మ వచ్చి నా ఎదురుగా నిల్చుండేవారు కదూ.చిన్నారి,ఇందు,బుజ్జి తో కలసి ఇల్లేరమ్మ ఇంకా మా ఇంట్లో ఆడుతున్నట్లే అనిపిస్తుంది.మా బుజ్జి చిత్రాలకొలువు నా పొట్టలో ఉన్నపుడు(వీడి గురించి మీకు చెప్పనే లేదు కదూ.వేరే పోస్ట్ పెట్టి చెప్తానేం) ఇల్లేరమ్మ కతలు చదువుకుని నవ్వుకుంటుంటే నా పొట్టలోని చిన్ని ప్రాణం కూడా నాతో పాటు నవ్వుతున్నట్లే అనిపించేది.

                          వినాయకచవితి పూజ లో హిందూ దేవతల పాటలు పాడేసి మళ్లీ అవే పాటలు పాడాలంటే విసుగొచ్చి తన చెల్లెల్లని ఒప్పించి వాళ్ల అమ్మ గారు పని పూర్తి చేసుకుని వచ్చే లోపు సీతాదేవి విగ్రహాన్ని మేరీ మాతలా తయారుచేసి,వినాయకుడిని బాలయేసులా మార్చేసి బాలయేసు బొద్దుగా ఉన్నాడని బాధపడిపోయి మళ్లీ అంతలోనే కొంతమంది చిన్నపిల్లలు చిన్నపుడు బొద్దుగానే ఉంటారు అని సర్దిచెప్పుకుని స్కూలులో నేర్పిన ఏసుక్రీస్తు పాటలు వినాయకుని ముందు తన చెల్లెల్లతో కలసి పాడి,అమ్మ వచ్చేస్తుంటే “అమ్మొస్తుంది పాట మార్చేయండే బాబూ” అని కంగారు పడిపోయి,ఇంతలో వాకిట్లో జీప్ లోంచి దిగిన నాన్న గారిని చూసి”అమ్మా  పరలోకం నుంచి నాన్నొచ్చారు” అని చెప్పే అల్లరి పిల్ల ఇల్లేరమ్మ,అమ్మ చెల్లిని ఎక్కువ ముద్దు చేస్తుందని”ఏమయినా అమ్మకి చిన్నారంటేనే ఎక్కువ ప్రేమ,అదే పని చేసినా మురిపెమే,బుజ్జన్నా కూడా ప్రేమే,ఇందు సంగతి నాకు తెలియదు కానీ,నేనంటే మాత్రం అసలు మనసులో ఏవిటుందో చెప్పటం కష్టమే,ఏమయినా మా అమ్మ నిజంగా చిన్నారీ వాళ్లమ్మే” అని ఉడుక్కుంటుంది.నందికేశుని నోము కోసం ఇంట్లో చెప్పకుండా పిల్లలతో కలిసి ఎవరింటికో వెళ్లిన ఇల్లేరమ్మ ని అమ్మ ఏమయినా అంటుందేమో అని నాకు కూడా భయమేసింది సుమీ.కానీ ఏదో ఒకటి చెప్పి అమ్మ నుంచి తప్పించుకోగల మాటకారి కదూ ఇల్లేరమ్మ.స్కూల్లో భూగోళం పాఠం విని”భూగోళమే ఇసుక రేణువు కంటే చిన్నదంటే ఇంకా మిగతా వాటి లెఖ్ఖేమిటి?”అని వైరాగ్యం తెచ్చుకుని నాన్న రగ్గులో ముసుగు పెట్టిన ఇల్లేరమ్మ ని చూసి వాళ్ల అమ్మానాన్నగార్లతో పాటు మనకు కూడా కాసేపు బెంగొచ్చేస్తుంది. మళ్లీ చివర్లో దీపావళి పండక్కి తనకి కావలసిన సామాన్ల లిస్టు రాసిన ఇల్లేరమ్మని చూసి అమ్మతో పాటు మన ముఖం కూడా వెలిగిపోతుంది.అమ్మ కోరిక మేరకు సినిమాకి తీసుకెళ్లటానికి నాన్నని ఒప్పించే బాధ్యత కూడా ఇల్లేరమ్మదే.ఇడ్లీ పిండిని అక్కచెల్లెల్లు పరీక్షించటం,వీళ్లు నడిపిన”నారింజ సమ్మర్ స్కూల్”,నాన్నగారి ట్రాన్స్ఫర్ కబుర్లు ఇలా బోల్డన్ని కబుర్లతో పుస్తకాన్ని ఆపకుండా దగ్గరుండి చదివిస్తుంది ఇల్లేరమ్మ.అసలు ఇల్లేరమ్మ కబుర్లంటేనే చిరుమామిళ్ల సుబ్బారావు గారు పుస్తకం ముందు చెప్పినట్లు  స్వచ్ఛమైన పదహారణాల తెలుగు నవ్వు.ఆ అమాయకత్వం,ఆ స్వచ్ఛత కలిగిన ఆ బంగారు తల్లులని వాళ్ల నాన్నగారి ట్రాన్స్ఫర్ల పుణ్యమా అని తమ ఇళ్లలో అద్దెకుంచుకున్న వాళ్లు ఎంత అదృష్టవంతులో.

                                          మా బుజ్జిగాడు పొట్టలో ఉన్నపుడు ఇల్లేరమ్మ కతలు,వాడు పుట్టి నా ఒడిలో పాలు త్రాగుతున్నపుడు ఇల్లేరమ్మ అమెరికా ప్రయాణపు కబుర్ల పుస్తకం”ముగ్గురు కొలంబస్ లు” చదివి నవ్వుకున్నాను.ఆ పుస్తకంలో వాళ్లమ్మాయి జూనియర్ ఇల్లేరమ్మలా అనిపించారు.బుజ్జి ఇల్లేరమ్మ పెరిగి పెద్దదైపోయి,అమ్మమ్మ అయ్యాక చెప్పిన ఈ ముగ్గురు కొలంబస్ ల ప్రయాణపు కబుర్లు కూడా ఇల్లేరమ్మ చిన్నప్పటి కబుర్ల లాగానే కమ్మగా ఉన్నాయి.ఆ మధ్య ఫేస్బుక్ లో ఇల్లేరమ్మ తను పెట్టిన ఆవకాయ కబుర్లు చెప్పి నోరూరించారు.ఆరోగ్యం బాగా లేదని చదివి బాధనిపించింది కోలుకుంటున్నారని చదివి హాయిగా అనిపించింది.కానీ ఇంతలోనే ఇలా వెళ్లిపోవటం కష్టంగా అనిపిస్తుంది.

                                    పుస్తకాలను అభిమానించే వాళ్లం ఉన్నంత వరకు ఇల్లేరమ్మ తన ముచ్చటైన కుటుంబంతో సహా బోల్డన్ని ఇళ్లలో కూర్చుని ఆటలాడుతూనే ఉంటుంది.మన ద్వారా మన తరువాత తరాల వారికి పరిచయమై వాళ్ల అభిమానం కూడా సులభంగా సంపాదించుకుంటుంది.

                   

2 Comments »

హనుమంతరావు గారు

అక్కడక్కడ మట్టి అంటుకున్న తెల్లని లాల్చీ,పంచె,భుజం పైన తువ్వాలు,అవసరమైనంతవరకే మాట్లాడటం,ఆప్యాయమైన పలకరింపు,నెమ్మదైన నడక,సైకిల్ పై ప్రయాణం,హనుమంతరావు వ్రాలు అనే సంతకం -ఇవీ హనుమంతరావు గారు అనగానే గుర్తొచ్చేవి.హనుమంతరావు గారు యాభై ఎకరాల భూమిలో రకరకాల పంటలు పండించే రైతు.ఆయన,అతని భార్య పొలంలో కూలీలతో కలసి పొలం పనులు చేసుకునేవారు.ఆయన భార్య పెద్ద కుంకుమ బొట్టు,సిగ చుట్టూ ఎర్రని కనకాంబరాల దండతో ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు.హనుమంతరావు గారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందమ్మా అని తరచుగా అంటుంటారు.రకరకాల పంటలు,వాటి ఖర్చు,పాలేర్ల కూలీ డబ్బులు,పంటల మీద వచ్చే ఆదాయం వీటన్నింటికీ సంబంధించిన లక్షల్లో లావాదేవీలు అన్నీ మా బ్రాంచ్ లోనే జరుగుతాయి.ఎవరినీ ఎప్పుడూ తక్కువగా చూడరు,కించపరచి మాట్లాడరు.డబ్బు తెచ్చినపుడు అవి ఏ పంట నుంచి వచ్చిన ఆదాయమో,తీసుకువెళ్లేటపుడు అవి ఏ ఖర్చు కోసమో ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది.బ్రాంచ్ కి వెళ్ళే దారి లోనే వాళ్ల ఇల్లు.చుట్టూ అరటి చెట్లు,ఇంటి ముందు సంపెంగ,వేప చెట్లు,ఇంటి వెనుక పనస,మామిడి,కొబ్బరి చెట్లు.తోట మధ్యలో ఉన్నట్లుండేది ఇల్లు.

                                      ఇద్దరమ్మాయిలకు పెళ్లి చేసేసారు.అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిందమ్మా,మేనకోడలితో పెళ్లి నిర్ణయించాం అని చెప్పారు.ఆ అబ్బాయి కూడా ఒకటి రెండు సార్లు బ్రాంచ్ కి రావటం హనుమంతరావు గారు పరిచయం చేయటం జరిగింది.అబ్బాయి పేరు రమేష్.ఇంకో సారి వాళ్ల అబ్బాయిని,పక్కనే ఉన్న అమ్మాయిని చూపించి ఈ అమ్మాయేనమ్మా మా కాబోయే కోడలు అని పరిచయం చేయటం ఆ అబ్బాయి చిరునవ్వుతో చూడటం,ఆ అమ్మాయి కొంత ఇబ్బందిగా ముఖం పెట్టుకోవటం జరిగింది.కారణాలేవైనా కానీ నెల రోజుల తరువాత హనుమంతరావు గారి ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ రోజు ఊరిలో అందరూ తమ కుటుంబంలోని వ్యక్తికి కష్టమొచ్చినంతగా బాధ పడ్డారు.

                                        ఆ సంఘటన తరువాత హనుమంతరావు గారి భార్య ఇంటి గడప దాటలేదు.అతను మాత్రం ఎప్పటి లాగానే  వ్యవసాయం పనులు చేసుకునేవారు.కానీ నడక మరింత నెమ్మదించింది.మాటల స్థానంలో మౌనం చేరింది.కళ్ళలో నిరాశ,బాధ వచ్చి చేరాయి.ఎప్పుడూ మనుషులతో సందడిగా ఉండే ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది.ఎనిమిది నెలల తరువాత మేనకోడలు ప్రేమించిన వ్యక్తితో ఆమె పెళ్లి చేశారు.

                                        సంవత్సరం తరువాత ఒకరోజు వాళ్లింటి ముందు నుంచి వెళుతుంటే పరుగెత్తుకుంటూ నా దగ్గరకి వచ్చారు.అమ్మా మనవడు పుట్టాడు ఎనిమిదేళ్ళ నుంచి పిల్లలు లేని నా కూతురికి,నా కొడుకు చనిపోయిన సంవత్సరం తరువాత కొడుకు పుట్టాడమ్మా.రమేశ్ నా మనవడి రూపంలో మళ్ళీ నా దగ్గరకి వచ్చాడమ్మా అంటూ కళ్ళ నిండా నీటితో సంతోషంగా కనిపించారు.ఆ రోజు ఊరు మొత్తం సంతోషించారు.తరువాత హనుమంతరావు గారు,అతని భార్య వాళ్ల ఇంటి ముందు అరుగులపై ఆ అబ్బాయిని ఆడిస్తూ కనిపించేవారు.మనవడే హనుమంతరావు గారి ప్రపంచమైపోయాడు.మళ్ళీ ఆ ఇంట్లో సందడి,సంతోషం వచ్చి చేరాయి.

                                       

10 Comments »

మళ్లీ ఎప్పుడొస్తావు?

నువ్వు వస్తావు రెండు మూడు రోజులుండి వెళ్లిపోతావు.నువ్వు వెళ్లిన రోజు గదిలో తలుపేసుకుని ఎవరినీ కలవకుండా,ఏమీ మాట్లాడకుండా పడుకుండిపోవాలనిపిస్తుంది.నువ్వు వెళ్లిన రెండు రోజుల వరకు మా పడుకునే గది లో పడుకోకుండా నువ్వు ఆ రెండు రోజులు పడుకున్న మంచం పై పడుకుంటాను.నాకెపుడైనా బాగా దిగులుగా అనిపించినా,ఒంట్లో బాగులేక పోయినా నీ చీర నా చుట్టూ చుట్టుకుని పడుకుంటాను.ఏడుస్తాను ఆ చీర కొంగుతోనే కళ్లు,ముక్కు తుడుచుకుంటాను.నేనెప్పుడైనా నీ ఎదురుగా దిగులుగా కనిపించినా,ఒక్కోసారి ఏడ్చినా నువ్వు నన్ను పట్టుకుంటావు.నువ్వు నిల్చుంటావు,నేను కూర్చుని నీ నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుంటాను.నువ్వు మౌనంగా నీ చీర కొంగుతో నా ముఖం తుడుస్తావు ఆ కాసేపటిలో ఆ స్పర్శలో నీ నుంచి నా లోకి ఓదార్పు,ధైర్యం అన్నీ ప్రసరించేవి.నువ్వు వస్తావు నేను నీ వెనకే తిరుగుతుంటాను నువ్వు రోజులో కనీసం రెండు సార్లైనా అంటావు మీ అత్తగారిని కూడా ఇలాగే చూసుకోవాలి నువ్వు అని.ఉన్నంత సేపు మొహమాటం గా ఎవరో బయటి వాళ్ల ఇంట్లో ఉన్నట్లు ఇబ్బందిగా ఉంటావు.నిన్ను బయటకి తీసుకు వెళ్లి అన్నీ చూపించాలని ఎంత ఆశగా ఉంటుందో తెలుసా?కానీ రమ్మని పిలిస్తే రావు నీరసంగా ఉంది రాలేను అని అబద్ధం చెబుతావు.నువ్వు వస్తే నేను,కృష్ణల సరదా కి అడ్డంగా ఉంటావేమో అని మనసులో అనుకుంటావు.నాకెంత కోపమొస్తుందో తెలుసా?నువ్వు,నాన్న నా చిన్నపుడు నన్ను ప్రతీ దగ్గరకి తీసుకు వెళ్లేవారు కదా ఇప్పుడు మరి నువ్వెందుకు నాతో రావు అని గొడవ పెట్టాలనిపిస్తుంది. నాకెంత బాధనిపిస్తుందో తెలుసా?నీకు గుర్తుందా నాన్న చనిపోయిన రెండు మూడేళ్ల వరకు బయటి ప్రపంచం చూడటానికి ఇష్టపడే దానివి కాదు ఆఖరకు మేడ మీదకు కూడా వచ్చేదానివి కాదు.కానీ నాన్న సంవత్సరీకం రోజు మేడ పైకి విస్తరాకులో అన్నీ వడ్డించి తెచ్చి కాకులకు పెట్టే దానివి ఆ రోజు నీ కనుల లోని నీరు అర్ధం చేసుకునే వయసు రాక ముందు ఎంతగా సరదా పడి మేడ మీద మొక్కలు,మేడ పై నుంచి ఊరు నాకు ఆశ్చర్యం అనిపించిన అన్నీ అమ్మా అది చూడు ఇది చూడు అని చూపించేదాన్ని.నువ్వేమో మెత్తగా నా తల నిమిరి మెట్లపై కాసేపు కూర్చుని క్రిందకు వెళ్లేదానివి.

నీకు గుర్తుందా వేసవికాలంలో విశాలంగా ఉండే మన ఇంటి మధ్య గదిలో క్రిందనే తలగడ వేసుకుని చుట్టూ పుస్తకాలు(నేనేమో చందమామ,బుడుగు,అత్తగారి కధలు,chicken soup for the soul series,nicolas sparks The last song పుస్తకాలు,నువ్వేమో వారపత్రిక లు,జీవిత కధల పుస్తకాలు)చదువుకుంటూ కబుర్లాడుకుంటూ తలగడతో పాటు ఇంట్లో నేలంతా బద్ధకంగా తిరిగే వాళ్లం.ఎంత బాగుండేవి ఆ వేసవి కాలపు సెలవుల బద్ధకపు మధ్యాహ్నాలు.ఇప్పడేమో ఆ పక్కిింటి పిల్ల రాక్షసి కావ్య నా స్థానాన్ని ఆక్రమించేసింది అని చెబుతూ నవ్వుతుంటావు నువ్వు.

ఈ మధ్య  నీకు కాస్త ఆరోగ్యం బాగులేకపోతే వయసు పెరుగుతుంది కదా ఇబ్బందులు తప్పవు అని డాక్టర్ గారు అన్నారని చెప్పావు ఎందుకో ఆ మాట నీ విషయంలో విని జీర్ణించుకోలేకపోయాను.ఉద్యోగం చేస్తూ ధైర్యం,గాంభీర్యం అనే ముసుగు బయటకి వేసుకుని తిరుగుతున్నా నీ విషయంలో మాత్రం అమ్మ  కనిపించకపోతే గుక్కపట్టి ఏడ్చే పసిదాన్నే అమ్మా ఇంకా.ఎవరైనా ఎక్కడైనా తల్లిదండ్రులు కొడుకు ఇంట్లో ఉండటానికి హక్కు ఉంటుంది కూతురింట్లో ఉండకూడదు లాంటి మాటలు మాట్లాడితే విని నీ ముఖం లో బాధ లాంటి ఆ భావం నేనసలు చూడలేను తట్టుకోలేను.అమ్మ కు,కూతురికి మధ్య బంధం గాఢత వారిద్దరికీ తప్ప ఇంకెవరికమ్మా అర్ధమవుతుంది?మళ్లీ ఎప్పుడొస్తావమ్మా?

7 Comments »

సంక్రాంతి ప్రయాణం

సంక్రాంతి కి ఊరు వెళ్తున్నాం.ఈ రోజు ఈ సంతోషంతో ఉదయం మూడింటికే మెలకువ వచ్చేసింది.చిట్టి చేమంతులు,కాణీ చేమంతులు,బంతిపూలు,చేమంతులు,బంతి పూల లో దాదాపు పది రకాల పూలని,చెరువు ను,ఊరిని,రామయ్య తండ్రిని,సీతమ్మ తల్లిని,గుడిలో ఇంటి పెద్ద లాగ గంభీరంగా కూర్చుని అంతా గమనిస్తున్న శివయ్య ను,నూర్పులు అయ్యాక బస్తాల నిండా నింపిన ధాన్యాన్ని,ఊరు దాటి వెళ్లి పెద్ద పండగ కి ఊరు చేరుకున్న మా లాంటి వలస జీవులను,పండుగను,సందడి ని కనుల నిండా చూసుకుని,ఊరి గాలిని మనసు నిండా పీల్చుకుని,భోగి మంట దగ్గర చలి కాచుకుని,గోదాదేవి కళ్యాణం లో కూర్చుని,సంక్రాంతి కి వాకిలి ని ముగ్గులతో నింపేసి,అమ్మ వండే జంతికలు,వంకాయ పచ్చడి,కమ్మని పోపు వాసన వచ్చే గుమ్మడికాయ కూర,చేమ దుంపల కూర,సంక్రాంతి రోజు ప్రత్యేకంగా అన్ని కూరగాయలు కలిపి చేసే కూర,అత్తమ్మ  చేసే సున్నుండలు అన్నీ ఎటువంటి పరిమితులు లేకుండా తినేసి,వీధిలో అందరూ ఒక దగ్గరకు చేరి మా కల్లంలో వండే అరిసెల వంట దగ్గర కూర్చుని వాళ్లతో కలసి మనస్ఫూర్తిగా నవ్వుకుని,రాత్రి అందరం వరుసగా పడుకున్నపుడు ప్రతీ సంవత్సరం పంచుకునే పెద్ద వాళ్ల ఙాపకాలను ప్రతీ సంవత్సరం లాగానే ఆసక్తిగా వినేసి,నాకు ఎంతో ఇష్టమైన ప్రపంచంలో ప్రతీ క్షణాన్ని మనసారా ఆస్వాదించేసి చివరి రోజు దిగులుగా ఊరు కనిపించేంత వరకు వెనుకకు తిరిగి చూస్తూ వెళుతుంటే చుట్టపుచూపు కోసం ఊరు దాటితే తిరిగి రావచ్చు కానీ బ్రతుకు తెరువు కోసం ఊరు దాటితే తిరిగి రావటం కష్టం అనే బ్రహ్మోత్సవం సినిమా డైలాగ్ గుర్తుకు వస్తుంది మనసు బెంగతో బరువెక్కిపోతుంది.

4 Comments »

తను కుక్క కాదు….మిక్కీ

పక్కింటి లోని నీలిమ గొంతు నుంచి వినిపించిన పై వాక్యం విని గతం గుర్తొచ్చి”కుక్కలు వాటితో నా ఙాపకాలు” అనే విషయం పై ఒక పోస్ట్ వ్రాయాలని అప్పటికప్పుడు నిర్ణయించేసుకున్నాను.ఏంటీ కుక్కపిల్లల గురించి బ్లాగ్ లో ప్రత్యేకంగా ఒక పోస్ట్ వ్రాయాలా అనుకోకండి.అసలు నేను ఇలాంటి చిన్ని చిన్ని విషయాల గురించి మాత్రమే అనర్గళంగా చెప్పగలను.ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది చిన్నపుడు స్కూల్ లో ఇలాంటి విషయాలపై వ్యాసరచన పోటీలు,వ్యకృత్వ పోటీలు ఎందుకు ఉండేవి కావు అని.ఇక కుక్కపిల్లలు వాటితో నా ప్రయాణం విషయానికొస్తే ……కుక్కలతో నా పరిచయం అమ్మ మాటల ద్వారా టైగర్ తో మొదలై ఇప్పుడు పక్కింట్లో ఉండే మిక్కీ వరకు నిరాటంకంగా కొనసాగుతుంది.మధ్యలో ఒకటి,రెండేళ్లు విరామం వచ్చినప్పటికీ కుక్కల గురించి మురిసిపోతూ,ముచ్చటగా చెప్పుకునే కుక్కపిల్లల వీరాభిమానులు నా నిత్యజీవితంలో భాగంగా కొనసాగుతునే ఉన్నారు.

                                           అమ్మ పెళ్లి కాక ముందు మామయ్య ఆర్మీలో ఉండేటపుడు తీసుకొచ్చిన alsatian జాతి కుక్క టైగర్.టైగర్ తో ప్రత్యక్షంగా పరిచయం లేనప్పటికీ నేను చిన్నపుడు అన్నం తినకుండా అల్లరి చేస్తూ కుదురుగా ఉండకుండా అటూ,ఇటూ పరుగెడుతుంటే నన్ను ఒక దగ్గర కూర్చోపెట్టటానికి అమ్మ టైగర్ కబుర్లు చెప్పేది.అది ఎంత పెద్దగా ఉండేదో,అందరూ దానిని చూసి ఎంతగా భయపడేవారో చెబుతుంటే నేను కూడా భయంతో బుద్ధిగా అన్నం తినేసేదాన్నంట.నేను స్కూల్ కి వెళుతున్న సమయంలో అమ్మ వాళ్లు వద్దంటున్నా నేను సరదా పడతానని మామయ్య టింకూని తీసుకొచ్చారు.బోలెడు తెల్లని జూలుతో బుజ్జిగా ఉండే చిన్న కుక్కపిల్ల టింకూ.నాతో స్కూలు,కాలేజ్ లో  పదేళ్లు కలసి చదివిన శుభ,వసు కి కూడా టింకూ తో ఫ్రెండ్ షిప్ కుదిరింది.అమ్మ,పెద్దమ్మ రోజంతా కుక్క పిల్లతో ఆటలేంటి అని తిడుతున్నా పట్టించుకోకుండా మా నలుగురి స్నేహం దినదినాభివృద్ధి చెందసాగింది.ఎవరైనా దానిని కుక్క అంటే ఒప్పుకునే వాళ్లం  కాదు అది కుక్క కాదు టింకూ అంటూ ముక్త కంఠంతో కోపంగా సమాధానం చెప్పేవాళ్లం.టింకూ కూడా నేను స్కూల్ కి వెళుతున్నపుడు నా సైకిల్ వెనకే వీధి చివరి వరకు పరుగెత్తి నన్ను వదలలేక వదలలేక బెంగతో ఇంటికి వెళ్లేది.బయటి కుక్కలతో గొడవ పెట్టుకోకుండా అది క్షేమంగా ఇంటికి చేరిందో లేదో అన్న బెంగతో నేను స్కూల్ కి వెళ్లేదాన్ని.మా ఇద్దరి బాధ చూసి నవ్వాలో,ఏడవాలో తెలియక”మరెందుకు దానిని నీతో పాటు తీసుకు పో.చదువు సంధ్య లేకుండా నలుగురూ అక్కడ కూడా ఆడుకుందురు” అంటూ నన్ను తిడుతూ టింకూ ఇంటికి వెళ్లే వరకు గేట్ దగ్గర నిల్చునేది అమ్మ.స్కూల్ కి వెళ్ళి మొదటి గంట ఫిజిక్స్ క్లాస్ ని కొంచెం కూడా వినకుండా సార్ కి మా గొంతు వినపడకుండా లోగొంతులో టింకూ కబుర్లు,నవ్వులు పంచుకునే వాళ్లం నేను,శుభ,వసు.

                                                  ఒకానొక వేసవి సెలవుల కాలంలో పాత కాలం నాటి పెద్ద భవనమైన కోర్టు ముందు సైకిల్ పోటీలు పెట్టుకుని,పున్నాగ పువ్వులు ఏరుకుంటూ,బోలెడు నవ్వులు పోగేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా మా క్లాస్ మేట్ వెంకటేష్ గుండుతో కనిపించాడు.ఎక్కడికి వెళ్లావ్ గుండు చేయించుకున్నావు అని సైకిల్ తొక్కుతూనే గట్టిగా అరుస్తూ వెంకటేష్ ని అడిగింది శుభ.వేసవి కాలంలో ఎక్కవ జుట్టు ఉంటే చికాకుగా ఉంటుందని మా నాన్న గారు గుండు చేయించేసారు నాకు అని చెప్పాడు.అంతే మా టింకూకి కూడా ఎక్కువ జూలు వలన చికాకు కలగ కుండా దానికి కూడా జూలు కట్ చేయాలని ముగ్గురం నిర్ణయించాం.జూలు కట్ చేయటం మాకు రాదంటూ నేను,వసు చేతులెత్తేసాం.ఇంతలో శుభ నాకు చాలా బాగా వచ్చు నేను కట్ చేస్తాను అంది.మరుసటి రోజు మధ్యాహ్నం అమ్మ,పెద్దమ్మ పడుకున్న సమయంలో శుభ కత్తెర,దువ్వెన పట్టుకొచ్చింది.దువ్వెన ఎందుకు అని అడిగిన మాకు దువ్వెన పెట్టి కట్ చేస్తేనే చక్కగా ఉంటుంది.నా చిన్నపుడు మా నాన్నగారు హెయిర్ కట్ చేయించుకోవటానికి వెళ్లినపుడు ఆయనతో పాటు వెళ్లి నేను చూసాను అంది.మా ముగ్గురిలో ఒక trained beautician ఉన్నందుకు కాసేపు గర్వపడ్డాం.నా జడ చివర కూడా లైన్ గా ఉండేలా రేపు నా జుట్టు కూడా బాగా కట్ చేయవా శుభా అంటూ వసు తనని బ్రతిమలాడుకుంది.నాకు జుట్టు అంటే బాగా పిచ్చి కాబట్టి జుట్టుని కత్తెర తాకటం అనే ఊహని కలలోనైనా రానీయను కాబట్టి నా జుట్టు బాధ్యతని శుభ చేతిలో పెట్టాలన్న ఆలోచన నాకు రాలేదు.మా కుతంత్రం తెలియని టింకూ గెంతుకుంటూ మా చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగింది.నేను,వసు టింకూ ని కదలకుండా పట్టుకోగా శుభ టింకూ కి జూలు కట్ చేసింది.మా నుంచి తప్పించుకోవటానికి టింకూ చేసిన విఫలయత్నం ఫలితంగా దాని జూలు ఒక పద్థతంటూ లేకుండి పిచ్చిపిచ్చిగా కట్ చేయబడింది.ఆ సంఘటన తో టింకూ మనోభావాలు దెబ్బతిన్నాయి.మా ముగ్గురినీ విలన్స్ ని చూసినట్లు చూసేది.నెల రోజుల వరకు బెంగతో కూడిన సిగ్గుతో బయటకు రాకుండా మా వరండాలో ఉన్న పెద్ద చెక్క సోఫా కింద దిగులుగా కూర్చునేది.ఈ సంఘటన తరువాత టింకూని ముట్టుకుంటే కొడతానని వార్నింగ్ ఇచ్చింది అమ్మ. ఆ క్షణంలో అమ్మ నన్ను తిడుతున్నా తన మనసు పొరల్లో కి టింకూ పై ఉన్న ప్రేమని చూసి నేను కంట తడి పెట్టుకున్నంత ఆనందంగా ఫీల్ అయ్యాను.వారం రోజుల వరకు వసు,శుభ మా ఇంటి వైపు రాలేదు.మా వేసవి సెలవులు నిస్సారంగా మారాయి.ప్రశ్చాత్తాప భావంతో ఈ సంఘటన మొత్తానికి కారణమైన వెంకటేష్ తో మాటలు మానేసి,నవ్వులు మానేసి నిశ్శబ్ధంగా ఆడుకోసాగాం.

                                కాలం ఎంతటి గాయాన్నైనా మానేలా చేస్తుంది అన్న వాక్యాన్ని నిజం చేస్తూ కొన్నాళ్ల తరువాత టింకూ మాతో మళ్లీ ఆటలు మొదలు పెట్టింది.మనుషుల మాటలు అర్ధం చేసుకునేది.మాతో కలసి చెరకు కూడా తినేది.అది చూసి చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా అనే పద్యం ఎందుకలా తప్పుగా చెప్పారా అని తెగ ఆలోచించేదాన్ని.ఇలా జరుగుతూ ఉండగా నేను కాలేజ్ చదివే రోజుల్లో ఎలుకల కోసం పెట్టిన మందు పొరపాటున తినేసి చనిపోయింది టింకూ.ఆ రోజు నుంచి నెల రోజుల వరకు ముగ్గురం బాధ నుంచి తేరుకోలేదు.పాపం అది చనిపోయిన రోజు అమ్మ,పెద్దమ్మ కూడా కంటతడి పెట్టుకున్నారు.వారం రోజుల వరకు కళ్లు తుడుచుకుంటూ,ముక్కులు చీదుకుంటూ కాలేజ్ కి వెళ్ళాం.కాలేజ్ లో మేం ముగ్గురం ఎవరెవరికి తెలుసో వారందరికీ టింకూ చనిపోయిందని తెలిసిపోయింది.ఒకరోజు ఫిజిక్స్ క్లాస్ లో కళ్లు తుడుచుకుంటుంటే లెక్చరర్ అడిగారు ఏమయింది వీళ్లకి అని.వెంటనే మా ప్రతిపక్ష పార్టీకి చెందిన హరిణి వాళ్ల కుక్క చనిపోయిందని ఏడుస్తున్నారు అని చెప్పింది.మేం వెంటనే కుక్క కాదు టింకూ అన్నాం కోపంగా.మా ఫిజిక్స్ లెక్చరర్ కి కూడా మా టింకూతో పరిచయం ఉంది ఎలా అంటారా?నా ముందు సంవత్సరం ఫిజిక్స్ రికార్డ్ లో కొన్ని పేజీలలో బురదతో కూడిన రెండు,మూడు టింకూ పాదముద్రలు చూసి నన్ను తిట్టారు.మరేం చేస్తాం చక్కగా ఆరుబయట క్రిందనే కూర్చుని రికార్డ్ వ్రాసుకుంటూ కూడా టింకూతో ఆడేదాన్ని మరి.పాపం ఆయన కూడా మొహమాటానికి ఒక రెండు మూడు నిమిషాలు విచారించారు.ఆ తరువాత చాలా రోజుల వరకు ఏడుపు అవసరమైనపుడల్లా టింకూని తలచుకుని ఏడిచే వాళ్లం.అప్పటి నుంచి కనీసం నా అభిప్రాయం తీసుకోకుండా మా ఇంట్లో కుక్కపిల్లల పెంపకాన్ని నిషేధిస్తూ అమ్మ,పెద్దమ్మ ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.

                                  తరువాత మామయ్య కూతురు మేఘన పెంచిన కుక్క తో స్నేహం పెరిగింది.తను పెళ్లయ్యాక అందరూ వద్దని మొత్తుకుంటున్నా వినకుండా కుక్కపిల్లని కూడా తనతో తీసుకు వెళ్లటం,కొన్నాళ్ల తరువాత డిసెంబరు 31వ తారీఖు రాత్రి ఆ కుక్కపిల్ల తప్పిపోవటం,తన ఏడుపు చూడలేక వాళ్లాయన రాత్రంతా కుక్కపిల్లని వెతికి తెచ్చేందుకు విఫల యత్నం చేయటం,ఇదంతా చూసి ఒళ్లు మండి వాళ్ల అత్తయ్య గారు వాళ్లింట్లో కుక్కలను నిషేధిస్తూ ఆఙలు జారీ చేయటం అదంతా ఒక కధ.

                                ఇలాంటి ఇంకా ప్రస్తుతం నాకు గుర్తుకు రాని బోలెడు సంఘటనల వలన మా ఇంట్లో పెద్దలకి,వాళ్ల ద్వారా మాకు కుక్కలను పెంచకూడదు అన్న భావం స్ధిరపడింది.

                                  ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మా వారి ఉద్యోగరిత్యా,అమ్మ వాళ్లింటికి,అత్త గారింటికి దూరంగా ఇక్కడకొచ్చి పడిన మా జీవితంలోకి మా పక్కింటి మిక్కీ రూపంలో ఇంకో బుజ్జి కుక్క పిల్ల వచ్చి చేరింది.ఇంట్లో దిగిన మొదటి రోజు మాతో పాటు వచ్చిన ఆడపడచు కూతురు బుజ్జి జాహ్నవి ఆ మిక్కీ ని చూసి సంబరంగా  కుక్కపిల్ల అని అరచినపుడు ఆ మాట వారికి వినపడకుండా తన నోరు జాగ్రత్తగా మూసేసి ఇంట్లోకి తీసుకెళ్లిపోయాం.ఎందుకంటే కుక్క ని కుక్క అంటే దానిని పెంచుతున్న వారికి ఎంత కోపం వస్తుందో అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి.మిక్కీ-వాళ్లింట్లో మనుషులతో సమానంగా తనని చూస్తారు.నేను,మా వారు వస్తుంటే మమ్మల్ని చూపించి మిక్కీ చూడు అన్న,వదిన వచ్చారు అంటుంటారు.మనసులో నవ్వుకుంటాను.పూజల దగ్గరకి తమతో పాటు తీసుకు వస్తారు.మొన్న వినాయక చవితి పూజలో వాళ్ల వెనకే మిక్కీ కూర్చుంటే పూజారి గారు వద్దంటే అంకుల్ కి బోలెడంత కోపం వచ్చేసింది.మా పిల్లలు ఎలా వచ్చారో అది కూడా అలాగే వచ్చింది తనని బయటకు పంపటం కుదరదు అయినా దేవుడి దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే అంటూ బోలెడు కోప్పడిపోయారు.ఉదయాన్నే ఐదు గంటలకి లేచి తలుపు తీసుకుని బయటకి వెళ్లగానే లోపలకి వస్తుంది అన్ని గదులు ఒకసారి చూసేసి బయటకి వెళ్లిపోతుంది.నిన్న సాయంత్రం కృష్ణ తో చిన్న గొడవ పడి ఈ రోజు ఉదయం కాస్త ఆలస్యంగా లేచి అలక నటిద్దామన్నా ఈ మిక్కీ వలన కుదరలేదు.ఉదయం ఐదింటికి అలారం కొట్టినట్లే వచ్చి తన కాళ్లతో ఆపకుండా తలుపు కొట్టటం మొదలు పెట్టింది.ఇక ఆ గోల భరించలేక అలక పక్కన పెట్టి లేవటం ఈయన చక్కగా ఒక చిరునవ్వు నవ్వుకోవటం జరిగాయి.మిక్కీ ని చూసి మురిసిపోతూ ఆంటీ చెబుతుంటారు మిక్కీ గాడికి పాలు,పెరుగు ఇష్టం అమ్మా కృష్ణాష్టమి రోజే చిన్నగా ఉన్నపుడు మేం తెచ్చుకున్నాం అని.

                                 ఇంకో విషయం చెప్పటం మరచిపోయా.మేఘన కొడుకు అల్లరి చేసి వాళ్ల నాన్నమ్మ ని ఒప్పించి labrador జాతి కుక్కని తెచ్చి పెంచుతూ వాళ్ల నానమ్మ ని ఆ కుక్క ప్రక్కన నిల్చోపెట్టి ఫొటో తీసి ఆ ఫొటో ని వాళ్లింట్లో అందరి whatsapp ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టేసాడు.

                                గతంలో కుక్కలంటే పిచ్చిగా ఇష్టపడే మేఘన ఫోన్ లో అంటూ ఉంటుంది ఆ కుక్క ని పెంచటం కోసం వీడు పెట్టే ఖర్చుతో ముగ్గురు మనుషులని పోషించచ్చు ఈ కుక్క బాధ పడలేకపోతున్నాం అని.శుభ కూతురు రోజూ కుక్కని పెంచుతానని అల్లరి చేస్తుంటే వద్దని తనని ఒప్పించటానికి శుభ పడే బాధ వింటూ నవ్వుకుంటాను.నాకు కూడా ఇప్పుడు కుక్కల వాసనకి అలర్జీతో జలుబు వచ్చేస్తుంది.మిక్కీని దూరం నుంచి పలకరించి ఆడటమే కానీ ముట్టుకుని ఆడుకునే వీలు,ఆసక్తి ఉండవు.

ఒకసారి మేమందరం గతంలో చేసిన అల్లరి పనులను తలచుకుని నవ్వుకునే ప్రయత్నమే ఇది.మీలో చాలా మందికి ఇలాంటి ఙాపకాలు ఉండి ఉండచ్చు ఒకసారి మీరు కూడా తలచుకుని ఆ ఙాపకాల నవ్వులని ఆస్వాదించండి.


                                         

4 Comments »

ఎర్రని తురాయి పూలు

పైన కనిపిస్తున్న పేరుకి ఇందులో విషయానికి ఎటువంటి సంబంధం లేదు.ఉదయం బోలెడు ముదురు ఎరుపు రంగు తురాయి పూలు చూశాను.ఏం పేరు పెట్టాలో తెలియక వాటి పేరు పెట్టేశానన్న మాట.చాలా రోజులైంది బ్లాగ్ లో వ్రాసి.పంచుకోవటానికి బోలెడు కబుర్లు.కానీ ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో తెలియటం లేదు.

                             ఉద్యోగంలో బదిలీ అయింది.అమ్మ వాళ్లింటికి,అత్త గారింటికి దూరంగా.కృష్ణ ఉంటున్న దగ్గరకి 70 కి.మీ. దూరంలోకి.పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోకి,బస్సు సౌకర్యం కూడా లేని దగ్గరకి.కొండ ప్రక్కనే ఊరు.బ్రాంచ్ మేనేజర్ గారు అన్నీ ఎంత పద్ధతిగా ఉంచుకున్నారో.అలా ఉంచుకోవటం నేర్చుకోవాలి.ఊరంతా పచ్చగా ప్రతీ ఇంటి ముందు బోలెడు మొక్కలు.రోజూ ఆఫీస్ నుంచి కృష్ణ  దగ్గరకి ఇంటికి వెళ్లేసరికి రాత్రి అయిపోతుంది.అమ్మ రోజూ ఫోన్ చేసి అంటుంది నువ్వు లేకపోవటం ఇల్లంతా ఖాళీగా ఉన్నట్లనిపిస్తుంది అని.

                              కొత్తగా,పూర్తిగా పరిచయం లేని వాతావరణం.15కి.మీ. దూరంలో బస్సు దిగి ఆటోలో వెళుతుంటే త్రోవంతా చింత చెట్లు,ఎర్రని కృష్ణ తామర పూలు.చింత చెట్ల నిండా పూలు.నిండా ఆకుతో గోరింటాకు చెట్లు.చుట్టూ పొలాలు,మధ్యలో ఇళ్లు.ఎంత ప్రశాంతంగా ఉంటాయో.ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు అక్కడకి వెళ్లటం.కానీ ఉద్యోగం చేస్తున్నపుడు అందులో మార్పులకు సిద్ధం కావాలి మరి.

                             రోజూ దాదాపు రెండు గంటల బస్సు ప్రయాణం.బస్సులో ఒక్కోరోజు ప్రక్కన కూర్చున్న వాళ్లతో కలిసే మాటలు.ఉదయం ఇంటి దగ్గర నుంచి వెళ్లేటపుడు బస్ లో అందరూ నాలాగ వేకువనే లేచి వంట చేసుకుని,ఇంటి పనులు చేసుకుని అలసి పోయి లంచ్ బాక్స్ బ్యాగ్ తో పరుగెడుతూ ఆఫీస్ కి బయలుదేరే వాళ్లే.బస్ ఎక్కి టికెట్ తీసుకోగానే నిద్ర లోకి జారిపోయే వాళ్లమే దాదాపుగా అందరమూ.ఈ జీవితపు పరుగులో అలసిపోతూ,కుటుంబాన్ని,ఉద్యోగాన్ని  బ్యాలెన్స్ చేసుకోవలసిన విషయంలో ఒత్తిడికి గురవుతూ,అటు ఉద్యోగాన్ని వదులుకోలేని మధ్యతరగతి అశక్తత కొంతమందిలో,తాము ఉద్యోగం చేయకపోయినా భర్త సంపాదనతో ఇల్లు గడిచే స్థోమత ఉన్నప్నటికీ తమకంటూ సమాజంలో ఒక గుర్తింపును తీసుకొచ్చిన ఉద్యోగంపై ఇష్టంతో ఉద్యోగం వదలలేని వారు ఇంకొంత మంది.ఎంత కష్టమైనప్పటికీ ఆ ఒత్తిడి ఏదో రకంగా దాటేసి పరుగెడుతుంటాం.ముఖాలపై అబద్ధమో,నిజమో,మనలాంటి వాళ్లే చుట్టూ కనిపిస్తుంటే అనుకోకుండా కొంత సమయానికి ఏర్పడే బలహీనమైన అనుబంధమో అందరి ముఖాల్లోనూ చిరునవ్వు రూపంలో కనిపిస్తుంటుంది.కొంతమంది బస్ ఎక్కగానే ఇయర్ ఫోన్ చెవిలో పెట్టేసుకుని,పాటలు వింటారు.ఇంకొంతమంది దేవుడి సహస్ర నామాల పుస్తకాలు చదువుకుంటారు.ఇంకొంత మంది నిద్ర లోకి జారుకుంటారు.ఇంకొంతమంది అందరూ కట్టుకున్న చీరలు,చుడీదార్ లు,గాజులు గురించి కబుర్లు చెప్పుకుంటారు.ఇంకొంతమంది కిటికీ లోంచి రోజురోజుకి కొత్త కొత్త గా ముస్తాబవుతున్న ప్రకృతిని చూస్తూ ఉంటారు.

                          ఇంటికి వెళ్లేసరికి రాత్రవుతుంది.షాపింగ్ మాల్స్,నగల షాపుల్లో యూనిఫామ్ చీరల్లో చిరునవ్వుతో కష్టమర్లకి నమస్కరిస్తూ ఉండే అమ్మాయిలు పని ముగించుకుని ఆ కృత్రిమ ప్రపంచం,చిరునవ్వుని వదిలేసి ఇంటికి వెళ్లేందుకు ఆటోల కోసం పరుగెడుతుంటారు.కాంప్లెక్స్ కి కృష్ణ వస్తారు నన్ను తీసుకెళ్లటానికి.ఐదు నిమిషాలు నడచుకుంటూ ఇంటికి వెళ్తాం.ఎంత లేటయినా పక్కింటి ఆంటీ,అంకుల్ మేలుకునే ఉంటారు నన్ను పలుకరించేసి వెళ్లి పడుకుంటారు.

                        త్రోవలో మెయిన్ రోడ్ ప్రక్కనే వైన్ షాప్ ముందు ఒకమ్మాయి బజ్జీలు లాంటివి ఏవో వేస్తుంటుంది తను కాదు గానీ తనతో పాటే ఒక చిన్నమ్మాయి ఏడేళ్లు ఉంటాయేమో నిల్చుంటుంది ఒక్కోరోజు.రోజూ ఆ చిన్నమ్మాయి ఉంటుందేమో అని కళ్లు వెతుకుతాయి తను లేని రోజు మనసుకు బాగున్నట్లనిపిస్తుంది.మరీ లేటయిన రోజు(ఎనిమిదిన్నర దాటిపోతే)కాంప్లెక్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బోలెడు మేకప్ వేసుకుని ఇద్దరు ముగ్గురు యువతులు నిల్చుంటారు మొదట్లో అయోమయంగా అనిపించేది.కృష్ణ దిక్కులు చూడకు వేగం నడు అంటుంటారు.భయమో ఏదో అర్ధం కాని ఫీలింగ్.ఎప్పుడూ చూడని,చూసి భరించలేని చీకటి కోణం అది.సమాజంలోని దుర్మార్గం,మనుషుల్లోని చీకటి,దైన్యం మనుషుల రూపంలో ఎదురుగా ఉన్నట్లనిపిస్తుంది.వీళ్ల బ్రతుకులు మారితే బాగుణ్ణు అని మనస్ఫూర్తిగా అనుకుంటాను.ఈ విషయం మాట్లాడటం మీలో చాలా మందికి రుచించకపోవచ్చు.కానీ పరిస్థితులు అనుకూలిస్తే,మంచి తల్లిదండ్రులు ఉంటే వాళ్లు కూడా మనలాగే సమాజంలో గౌరవంగా,హుందాగా బ్రతికి ఉండేవారేమో.కామెడీ షో పేరుతో వికారపు మాటలు,చేష్టలు టి.వి. లో కనిపిస్తాయి కదా దానికంటే అధ్వాన్నం  కాదేమో ఈ విషయం గురించి మాట్లాడటం.

క్రిందటి వారం అత్తగారింటికి వెళ్లి అత్తమ్మ తో,గర్భవతిగా ఉన్న ఆడపడచు తో అర్ధరాత్రి వరకు కబుర్లాడుకుని వెళ్లాను.ఈ వారం అమ్మ  వాళ్లింటికి వచ్చాను.ఈ ఇల్లు,ఈ ఊరు నాకెంతో ఇష్టమైన ప్రపంచం.ఈ 15 రోజుల్లో ఇంటిపై ఎంతగా బెంగ పెట్టుకున్నానో.చెరువు,చెరువు గట్టునే ఉన్న శివాలయం,రామాలయం,నిండా ఎర్రని పూలు నింపుకుని ముస్తాబైన తురాయి చెట్టు ఎంతందంగా ఉన్నాయో.మేడ మీద గది కిటికీ తెరచి పెట్టి హరిహరన్ గొంతునో,వేటూరి గారి సాహిత్యాన్నో,ఇళయరాజా,ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నో వింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో.నిన్న టి.వి.లో “ఒక మనసు” సినిమా చూశాను.ఆ సినిమా,అందులో ఇమిడిపోయిన బాధ చాలా సేపు వెంటాడాయి.

                    ఈ మధ్య గొల్లపూడి మారుతీరావు గారి”రుణం” పుస్తకం చదివాను.చాలా నచ్చింది.ఆ పుస్తకం గురించి వ్రాయాలనుకున్నాను కానీ అంత మంచి పుస్తకం గురించి వ్రాసేంత సామర్థ్యం నాకు లేదేమో అనిపించి ఆ ధైర్యం చేయలేదు.ఒక రోజులో కంగారుగా చదివేశాను ఈ సారి తీరికగా ప్రతీ వాక్యాన్ని ఆస్వాదిస్తూ చదవాలి.ఆ తరువాత పుస్తకం గురించి నాకు తోచినట్లు గా నేను వ్రాయటానికి ప్రయత్నిస్తాను.వేదాల లోని పవిత్రత,చీకటి ప్రపంచంలోని విచ్చలవిడితనం,తెగింపు రెండూ కనిపిస్తాయి.చెడుని మంచితో ఎలా మార్చవచ్చో కనిపిస్తుంది.పుస్తకంలో చాలా సేపు కనిపించే అగ్రహారం,వేద ఘోష మనసుకి చాలా నచ్చాయి.నిజ జీవితంలో కలలో కూడా ఊహించలేనంత మంచితనం అబ్బుశాస్త్రి పాత్రలో మనకు కనిపిస్తాయి.

“ఐశ్వర్యాన్ని,విద్యతో బేరీజు వేసుకుని,సంపన్నతని సంస్కారంతో కొలుచుకుంటున్న రోజులవి.” అంటూ మొదలు పెట్టి చివరలో “మంచితనం వైరస్ లాంటిది.అది నిదానంగా-కాని స్పష్టంగా ఆవరించుకుంటుంది.కృతఙత,ఉదాత్తత దాని కవల పిల్లలు” అంటూ ముగిస్తారు.అబ్బు శాస్త్రి,చయనులు గారు,సోమిదేవమ్మ,సర్వమంగళం,అనసూయ పవిత్రతకు మానవ రూపంలా కనిపిస్తారు.మిగిలిన పాత్రలన్నీ మంచితనం పరిమళం అనుభవించి మంచితనాన్ని వెదజల్లుతూ కనిపిస్తాయి.ఆ పుస్తకం చదివాక గొల్లపూడి మారుతీరావు గారి”సాయంకాలమైంది” పుస్తకం కోసం ప్రయత్నించాను.దొరకలేదు.

బద్ధకపు వర్షాకాలపు ఉదయాలు,పెరటి నిండా రంగురంగుల పూలతో మొదలయ్యే చలికాలపు ఉదయాలు,రామాలయం నుంచి ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి  గొంతులో వినిపించే సుప్రభాతమో,భక్తి గీతాలతోనో మొదలయ్యే ఉదయాలు,సన్నజాజుల పరిమళాలద్దుకున్న సాయంత్రాలు,పారిజాతాల నిరాడంబరతను నింపుకుని,దీపపు వెలుగులలో అందంగా ఉండే దేవుని గది,అమ్మ చేసే పచ్చళ్ల ఘమఘమలు నింపుకున్న వంటిల్లు,కిటికీలో నుంచి ప్రసరించే తొలి సూర్యకిరణాల వెలుగుతో అందం సంతరించుకునే నా చదువుకునే గది- ఇల్లే కదా ప్రపంచమంతటిలో హాయిగా అనిపించే ప్రదేశం.

                    ఆఫీస్ లో ఉన్నంతసేపు ఉద్యోగం చాలెంజింగ్ గా ఉంది బాగుందనిపిస్తుంది.ఇంటి కొస్తే చాలెంజింగ్ లేదు ఏం లేదు ఇంటి దగ్గర లో ఉండి దూరం బదిలీలు లేని ఉద్యోగమైతే బాగండనిపిస్తుంది.ఇక ఉంటానేం ఇప్పటికే ఎక్కువైంది నా సొంత గోల.

4 Comments »