mahivishnupriya

నా భావాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం

సెలవురోజు

on March 19, 2017


ఇంట్లో(పుట్టింట్లో) మేడ మీద గదిలో కిటికీలు తెరచి పెట్టి కిటికీ లోంచి చెరువు గట్టు పైన శివాలయం,రామాలయాలను చూస్తూ రామాలయం నుంచి వినిపిస్తున్న భజన వినిపిస్తుంటే పక్కింటి మేడ పైకి ప్రాకిన సన్నజాజి తీగ నిండా విచ్చుకుంటున్న సన్నజాజి మొగ్గల వాసన,ఇంకో ప్రక్కన కొబ్బరి,మామిడి చెట్ట మధ్య లో నుంచి కనిపిస్తున్న మిణుకుమిణుకు మనే నక్షత్రాలు…..ఎన్నాళ్లయిందో ఇలా తీరికగా ప్రశాంతంగా కూర్చుని.సాయంత్రం చినుకులు పడ్డాయి కాబట్టి చల్లగా అనిపించింది.

                               పెళ్లయ్యాక జీవితంలో హడావుడి పెరిగిపోయింది.పెళ్లి జరిగి సంవత్సరమైంది.ఈ సంవత్సరంలో ఒక వారం రోజులు కూడా కుదురుగా ఒక దగ్గర ఉండటం లేదు.ఎప్పుడూ పరుగులే.

                    ఉదయం నుంచి సాయంకాలం వరకు బ్యాంకులో హడావుడి(అసలే ఈ మధ్య బ్యాంకుల్లో తిరునాళ్లని గుర్తు తెచ్చేలా జనాలు.)దానికి తోడు ప్రమోషన్ కూడా తీసుకున్నాను.ప్రమోషన్ బాధ్యతని పెంచుతుందని వ్యక్తిగత జీవితానికి సరిపడేంత సమయం కేటాయించలేమని తెలిసి కూడా ప్రమోషన్ వద్దనుకోలేని పరిస్థితి.ఎప్పటికైనా తీసుకోక తప్పదు ఇప్పుడు వద్దనుకుంటే భవిష్యత్తులో ఎప్పడో ఒకప్పడు వద్దనుకున్నందుకు బాధ పడవలసి వస్తుందని తెలుసు.అలా అని ఇప్పుడేమైనా ప్రశాంతంగా ఉన్నానా అంటే అదీ లేదు ఈ ప్రమోషన్ వలన ఎక్కడికి బదిలీ చేస్తారో అనే బెంగ.పని ఎక్కువగా ఉండి రాత్రి ఏడున్నరకి ఇంటికి చేరినపుడు ఎందుకు ఈ ప్రమోషన్ తీసుకున్నాను అనే ఆలోచన.ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ఎంత ఉత్సాహంగా ఉండేదో.హాయిగా నాకు ఇష్టమైన గ్రామీణ ప్రాంతంలో,ఇంటి దగ్గర నుంచి రోజూ వెళ్లి వచ్చేయగలిగేలా,చేస్తున్న పనికి కాస్త అర్ధం ఉండేలా,ఉద్యోగం వలన మానసికంగా కాస్త సంతృప్తి ఉండేలా ఉండేది.ఇప్పడదేంటో రోజూ గందరగోళంగా నిద్రలో కూడా బెంగగా ఉంటుంది రాత్రికి రాత్రి రాజకీయ నాయకుడి మెదడులో మళ్లీ ఏ కొత్త పధకం రూపు దిద్దుకుంటుందో అని.ఈ పధకాలన్నింటి సంగతేమో కానీ సామాన్యులు,నిరక్షరాస్యులు కష్టపడి సంపాదించుకుని దాచుకుంటున్న డబ్బులకి కూడా ప్రభుత్వం మాతో పెట్టిస్తున్న నిబంధనలు,అడిగిస్తున్న రుజువుల బాధ భరించలేక ప్రజలకి బ్యాంకులంటేనే విరక్తి ఏర్పడిపోయిందన్నది మాత్రం కళ్లకి కట్టినట్లు కనపడుతుంది.

ఉద్యోగంలో ముఖ్యమైన పనులకు కూడా సెలవులు దొరకవు.ఎప్పడో అందరినీ బ్రతిమలాడి ఒకరోజు సెలవు సంపాదిస్తే ఇక ఆ సందర్భంలో మాటలు కూడా రాక ఆనందబాష్పాలు వచ్చేసే పరిస్థితి😊.

అత్తగారిల్లు,పుట్టిల్లు దగ్గర కాబట్టి వారంలో ఇక్కడ కొన్ని రోజులు,అక్కడ కొన్ని రోజులు,వారాంతంలో నాలుగు గంటలు ప్రయాణం చేసి కృష్ణ దగ్గరకి వెళ్లి అక్కడ ఇల్లు సర్దుకుని,ఇంట్లో పనులు చేసుకునే సరికి ఆ రోజు కాస్తా గడచిపోవటం,సోమవారం వేకువ ఝామున బయలు దేరి రావటం మళ్లీ వారం రోజులు మామూలే.

 అమ్మ వాళ్లింట్లో వేకువనే మెలకువ వచ్చినా అమ్మ లేపేంత వరకు మంచం పైనే ఉండటం,అమ్మ మళ్లీ మళ్లీ లేపుతున్నా లేవకుండా తనని కాసేపు అల్లరి చేసి తరువాత లేస్తాను.అత్తగారింట్లో ఆరు తరువాత లేస్తే ఏమనుకుంటారో అని బాగా గుర్తు పెట్టుకుని మరీ వేగం లేచి కూర్చుంటాను.పెళ్లయ్యాక ఆడపిల్లకి పుట్టింట్లో కొన్ని పరిమితులు,మెట్టినింట్లో కొన్ని హక్కులు వస్తాయంటారు.పుట్టింట్లో తోడబుట్టిన వారు లేకపోవటం వలన ఇక్కడ పరిమితులు పాటించాల్సిన అవసరం ఇంకా రాలేదు.

వారాంతంలో కృష్ణ దగ్గరకి వెళ్లినపుడు ఇంట్లో పనంతా అయిపోయాక ఇంటి ముందు మామిడి చెట్టు ఎదురుగా మెట్లు పై కూర్చున్నపుడు విమానాలు ఇంటిపై నుంచి దగ్గరగా వెళ్తూ కనిపిస్తాయి.అలా దగ్గరగా చూడటం కంటే చిన్నపుడు ఆకాశంలో దూరంగా పక్షిలా కనిపించే విమానాన్ని అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి విచిత్రంగా చూసే వాళ్లం(ఇప్పటికీ ఊరిలో చిన్నపిల్లలు అలాగే చూస్తారు) అలా చూడటమే బాగుందనిపిస్తుంది.రోజులో ఒక్క సారైనా కృష్ణతో అంటాను మన ఊరి వైపు వెళ్లిపోదాం అని.కృష్ణ దగ్గరకి వెళ్లిన కొత్తలో కూరగాయలు తో పాటు కరివేపాకు,దేవుడికి పెట్టటానికి పూలు కొనుకుంటుంటే మనసొప్పేది కాదు(ఇంట్లో పెరట్లో బోలెడు ఉంటాయి మరి.)

ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనిపించి ఈ రోజు అమ్మ వాళ్లింట్లో ఉండిపోయా. ఎన్నాళ్లయిందో ఈ ఊరిని మనసారా తనివి తీరా చూసుకుని.మధ్యాహ్నం పై మేడమీదకి వెళ్లి చూస్తే చుట్టూ డాబాలపై మంచి పెయింటింగ్ వేసినంత అందంగా అందరూ  ఎండుమిరపకాయలు,చింతపండు,పెసలు,మినుములు ఎండబెట్టుకున్నారు.ఎంతందంగా అనిపించిందో.ఎంతైనా పల్లెటూరు అందమే వేరు.

చాలా రోజుల తరువాత నేను మీతో కబుర్లు చెప్పటానికొచ్చాను కదా అందుకే గుర్తొచ్చినవన్నీ ఒక వరుస,పద్ధతి అంటూ లేకుండా గబాగబా చెప్పేసానన్న మాట.ఏమీ అనుకోవద్దు.


10 responses to “సెలవురోజు

 1. Naga Muralidhar Namala says:

  మేడ మీద గదిలో కిటికీలు తెరచి పెట్టి కిటికీ లోంచి చెరువు గట్టు పైన శివాలయం,రామాలయాలను చూస్తూ రామాలయం నుంచి వినిపిస్తున్న భజన వినిపిస్తుంటే పక్కింటి మేడ పైకి ప్రాకిన సన్నజాజి తీగ నిండా విచ్చుకుంటున్న సన్నజాజి మొగ్గల వాసన,ఇంకో ప్రక్కన కొబ్బరి,మామిడి చెట్ట మధ్య లో నుంచి కనిపిస్తున్న మిణుకుమిణుకు మనే నక్షత్రాలు…..ఎన్నాళ్లయిందో ఇలా తీరికగా ప్రశాంతంగా కూర్చుని

  కిటికీ తెరిస్తే ఇంకా ఇంతమంచి వ్యూ కనిపిస్తుంది అంటే అదృష్టవంతులే

  Like

 2. lalithats says:

  భలే భలే – మీకింకా ఇంకా సెలవు రోజులు రావలె – మాకు బోల్డన్ని పోస్టులు మీనుంచి దొరకవలె !

  Like

 3. Naga Muralidhar Namala says:

  మీరు కామెంట్స్‌కి రిప్లై ఇచ్చినట్టు కూడా తెలియటం లేదండి. రీసెంట్ కామెంట్స్, ఆర్కైవ్స్ లాంటి విడ్జెట్స్ బ్లాగులో పెడితే బావుంటుంది. మీ బ్లాగు విజిట్ చేసినవారికి నచ్చిన పోస్ట్ చదువుకునే వీలుంటుంది.

  Like

 4. విన్నకోట నరసింహారావు says:

  నాగ మురళీధర్ నామాల గారితో ఏకీభవిస్తున్నాను. ఆర్కైవ్ పెట్టమని గతంలో నేను కూడా ఓ కామెంట్ వ్రాసినట్లు గుర్తు.

  Like

  • chitralaxman says:

   అవునండీ మీరు కూడా నాగ మురళీధర్ గారు చెప్పినట్లు ఆర్కైవ్ పెట్టమని చెప్పారు.నేను బ్లాగ్ సాధారణంగా నా tab లో టైప్ చేస్తుంటాను.పైగా నాకు కంప్యూటర్ పరిఙానం తక్కువ.అందుకే బ్లాగ్ లో ఏదో రాసేసి పెట్టేయటమే కానీ మిగిలిన విషయాలలో మార్పులు చేయటం కోసం ప్రయత్నించటం లేదు.ఈ సారి కాస్త సమయం చూసుకుని మీరు చెప్పినట్లు ఆర్కైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను.

   Like

   • Naga Muralidhar Namala says:

    ట్యాబ్‌లో కూడా చేసుకోవచ్చు. మీరు లాగిన్ అయ్యాక అడ్మిన్ పేజ్‌లోకి వెళ్తారు కదా. లెఫ్ట్ సైడ్ మెనూలో Appearance అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే దానిక్రింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో widgets ఉంటుంది. అది క్లిక్ చెయ్యండి. అప్పుడు available widgets చూపిస్తాడు.అందులో సెర్చ్, ఆర్కైవ్, రీసెంట్ కమెంట్స్, రీసెంట్ పోస్ట్స్, టాప్ పోస్ట్స్, బ్లాగ్ స్టాట్స్ ఇలాంటి విడ్జెట్స్ సెలెక్ట్ చేసుకుని add widget క్లిక్ చెయ్యండి. చాలా సింపుల్ ఒక పది నిమిషాలు పడుతుంది అంతే.

    Like

 5. చాలా బాగుందండి !
  భావుకత్వం అంటే పడి చచ్చే మాలాంటివాళ్ళకు మీ టపాలు చదవడం వల్ల కలిగే ఆనందం మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఒకే రిక్వెస్ట్ ఎంటంటే కూసింత ఎక్కువ తరచుగా వ్రాయండి ప్లీజ్ !!
  శ్రీహరి

  Like

  • chitralaxman says:

   నేను వ్రాసే టపాలకు సంబంధించి భావుకత్వం అన్నది చాలా పెద్ద పదమండీ.ఏదో తోచింది వ్రాస్తున్నా అంతే.బ్లాగ్ నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: