పక్కింటి లోని నీలిమ గొంతు నుంచి వినిపించిన పై వాక్యం విని గతం గుర్తొచ్చి”కుక్కలు వాటితో నా ఙాపకాలు” అనే విషయం పై ఒక పోస్ట్ వ్రాయాలని అప్పటికప్పుడు నిర్ణయించేసుకున్నాను.ఏంటీ కుక్కపిల్లల గురించి బ్లాగ్ లో ప్రత్యేకంగా ఒక పోస్ట్ వ్రాయాలా అనుకోకండి.అసలు నేను ఇలాంటి చిన్ని చిన్ని విషయాల గురించి మాత్రమే అనర్గళంగా చెప్పగలను.ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది చిన్నపుడు స్కూల్ లో ఇలాంటి విషయాలపై వ్యాసరచన పోటీలు,వ్యకృత్వ పోటీలు ఎందుకు ఉండేవి కావు అని.ఇక కుక్కపిల్లలు వాటితో నా ప్రయాణం విషయానికొస్తే ……కుక్కలతో నా పరిచయం అమ్మ మాటల ద్వారా టైగర్ తో మొదలై ఇప్పుడు పక్కింట్లో ఉండే మిక్కీ వరకు నిరాటంకంగా కొనసాగుతుంది.మధ్యలో ఒకటి,రెండేళ్లు విరామం వచ్చినప్పటికీ కుక్కల గురించి మురిసిపోతూ,ముచ్చటగా చెప్పుకునే కుక్కపిల్లల వీరాభిమానులు నా నిత్యజీవితంలో భాగంగా కొనసాగుతునే ఉన్నారు.
అమ్మ పెళ్లి కాక ముందు మామయ్య ఆర్మీలో ఉండేటపుడు తీసుకొచ్చిన alsatian జాతి కుక్క టైగర్.టైగర్ తో ప్రత్యక్షంగా పరిచయం లేనప్పటికీ నేను చిన్నపుడు అన్నం తినకుండా అల్లరి చేస్తూ కుదురుగా ఉండకుండా అటూ,ఇటూ పరుగెడుతుంటే నన్ను ఒక దగ్గర కూర్చోపెట్టటానికి అమ్మ టైగర్ కబుర్లు చెప్పేది.అది ఎంత పెద్దగా ఉండేదో,అందరూ దానిని చూసి ఎంతగా భయపడేవారో చెబుతుంటే నేను కూడా భయంతో బుద్ధిగా అన్నం తినేసేదాన్నంట.నేను స్కూల్ కి వెళుతున్న సమయంలో అమ్మ వాళ్లు వద్దంటున్నా నేను సరదా పడతానని మామయ్య టింకూని తీసుకొచ్చారు.బోలెడు తెల్లని జూలుతో బుజ్జిగా ఉండే చిన్న కుక్కపిల్ల టింకూ.నాతో స్కూలు,కాలేజ్ లో పదేళ్లు కలసి చదివిన శుభ,వసు కి కూడా టింకూ తో ఫ్రెండ్ షిప్ కుదిరింది.అమ్మ,పెద్దమ్మ రోజంతా కుక్క పిల్లతో ఆటలేంటి అని తిడుతున్నా పట్టించుకోకుండా మా నలుగురి స్నేహం దినదినాభివృద్ధి చెందసాగింది.ఎవరైనా దానిని కుక్క అంటే ఒప్పుకునే వాళ్లం కాదు అది కుక్క కాదు టింకూ అంటూ ముక్త కంఠంతో కోపంగా సమాధానం చెప్పేవాళ్లం.టింకూ కూడా నేను స్కూల్ కి వెళుతున్నపుడు నా సైకిల్ వెనకే వీధి చివరి వరకు పరుగెత్తి నన్ను వదలలేక వదలలేక బెంగతో ఇంటికి వెళ్లేది.బయటి కుక్కలతో గొడవ పెట్టుకోకుండా అది క్షేమంగా ఇంటికి చేరిందో లేదో అన్న బెంగతో నేను స్కూల్ కి వెళ్లేదాన్ని.మా ఇద్దరి బాధ చూసి నవ్వాలో,ఏడవాలో తెలియక”మరెందుకు దానిని నీతో పాటు తీసుకు పో.చదువు సంధ్య లేకుండా నలుగురూ అక్కడ కూడా ఆడుకుందురు” అంటూ నన్ను తిడుతూ టింకూ ఇంటికి వెళ్లే వరకు గేట్ దగ్గర నిల్చునేది అమ్మ.స్కూల్ కి వెళ్ళి మొదటి గంట ఫిజిక్స్ క్లాస్ ని కొంచెం కూడా వినకుండా సార్ కి మా గొంతు వినపడకుండా లోగొంతులో టింకూ కబుర్లు,నవ్వులు పంచుకునే వాళ్లం నేను,శుభ,వసు.
ఒకానొక వేసవి సెలవుల కాలంలో పాత కాలం నాటి పెద్ద భవనమైన కోర్టు ముందు సైకిల్ పోటీలు పెట్టుకుని,పున్నాగ పువ్వులు ఏరుకుంటూ,బోలెడు నవ్వులు పోగేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా మా క్లాస్ మేట్ వెంకటేష్ గుండుతో కనిపించాడు.ఎక్కడికి వెళ్లావ్ గుండు చేయించుకున్నావు అని సైకిల్ తొక్కుతూనే గట్టిగా అరుస్తూ వెంకటేష్ ని అడిగింది శుభ.వేసవి కాలంలో ఎక్కవ జుట్టు ఉంటే చికాకుగా ఉంటుందని మా నాన్న గారు గుండు చేయించేసారు నాకు అని చెప్పాడు.అంతే మా టింకూకి కూడా ఎక్కువ జూలు వలన చికాకు కలగ కుండా దానికి కూడా జూలు కట్ చేయాలని ముగ్గురం నిర్ణయించాం.జూలు కట్ చేయటం మాకు రాదంటూ నేను,వసు చేతులెత్తేసాం.ఇంతలో శుభ నాకు చాలా బాగా వచ్చు నేను కట్ చేస్తాను అంది.మరుసటి రోజు మధ్యాహ్నం అమ్మ,పెద్దమ్మ పడుకున్న సమయంలో శుభ కత్తెర,దువ్వెన పట్టుకొచ్చింది.దువ్వెన ఎందుకు అని అడిగిన మాకు దువ్వెన పెట్టి కట్ చేస్తేనే చక్కగా ఉంటుంది.నా చిన్నపుడు మా నాన్నగారు హెయిర్ కట్ చేయించుకోవటానికి వెళ్లినపుడు ఆయనతో పాటు వెళ్లి నేను చూసాను అంది.మా ముగ్గురిలో ఒక trained beautician ఉన్నందుకు కాసేపు గర్వపడ్డాం.నా జడ చివర కూడా లైన్ గా ఉండేలా రేపు నా జుట్టు కూడా బాగా కట్ చేయవా శుభా అంటూ వసు తనని బ్రతిమలాడుకుంది.నాకు జుట్టు అంటే బాగా పిచ్చి కాబట్టి జుట్టుని కత్తెర తాకటం అనే ఊహని కలలోనైనా రానీయను కాబట్టి నా జుట్టు బాధ్యతని శుభ చేతిలో పెట్టాలన్న ఆలోచన నాకు రాలేదు.మా కుతంత్రం తెలియని టింకూ గెంతుకుంటూ మా చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగింది.నేను,వసు టింకూ ని కదలకుండా పట్టుకోగా శుభ టింకూ కి జూలు కట్ చేసింది.మా నుంచి తప్పించుకోవటానికి టింకూ చేసిన విఫలయత్నం ఫలితంగా దాని జూలు ఒక పద్థతంటూ లేకుండి పిచ్చిపిచ్చిగా కట్ చేయబడింది.ఆ సంఘటన తో టింకూ మనోభావాలు దెబ్బతిన్నాయి.మా ముగ్గురినీ విలన్స్ ని చూసినట్లు చూసేది.నెల రోజుల వరకు బెంగతో కూడిన సిగ్గుతో బయటకు రాకుండా మా వరండాలో ఉన్న పెద్ద చెక్క సోఫా కింద దిగులుగా కూర్చునేది.ఈ సంఘటన తరువాత టింకూని ముట్టుకుంటే కొడతానని వార్నింగ్ ఇచ్చింది అమ్మ. ఆ క్షణంలో అమ్మ నన్ను తిడుతున్నా తన మనసు పొరల్లో కి టింకూ పై ఉన్న ప్రేమని చూసి నేను కంట తడి పెట్టుకున్నంత ఆనందంగా ఫీల్ అయ్యాను.వారం రోజుల వరకు వసు,శుభ మా ఇంటి వైపు రాలేదు.మా వేసవి సెలవులు నిస్సారంగా మారాయి.ప్రశ్చాత్తాప భావంతో ఈ సంఘటన మొత్తానికి కారణమైన వెంకటేష్ తో మాటలు మానేసి,నవ్వులు మానేసి నిశ్శబ్ధంగా ఆడుకోసాగాం.
కాలం ఎంతటి గాయాన్నైనా మానేలా చేస్తుంది అన్న వాక్యాన్ని నిజం చేస్తూ కొన్నాళ్ల తరువాత టింకూ మాతో మళ్లీ ఆటలు మొదలు పెట్టింది.మనుషుల మాటలు అర్ధం చేసుకునేది.మాతో కలసి చెరకు కూడా తినేది.అది చూసి చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా అనే పద్యం ఎందుకలా తప్పుగా చెప్పారా అని తెగ ఆలోచించేదాన్ని.ఇలా జరుగుతూ ఉండగా నేను కాలేజ్ చదివే రోజుల్లో ఎలుకల కోసం పెట్టిన మందు పొరపాటున తినేసి చనిపోయింది టింకూ.ఆ రోజు నుంచి నెల రోజుల వరకు ముగ్గురం బాధ నుంచి తేరుకోలేదు.పాపం అది చనిపోయిన రోజు అమ్మ,పెద్దమ్మ కూడా కంటతడి పెట్టుకున్నారు.వారం రోజుల వరకు కళ్లు తుడుచుకుంటూ,ముక్కులు చీదుకుంటూ కాలేజ్ కి వెళ్ళాం.కాలేజ్ లో మేం ముగ్గురం ఎవరెవరికి తెలుసో వారందరికీ టింకూ చనిపోయిందని తెలిసిపోయింది.ఒకరోజు ఫిజిక్స్ క్లాస్ లో కళ్లు తుడుచుకుంటుంటే లెక్చరర్ అడిగారు ఏమయింది వీళ్లకి అని.వెంటనే మా ప్రతిపక్ష పార్టీకి చెందిన హరిణి వాళ్ల కుక్క చనిపోయిందని ఏడుస్తున్నారు అని చెప్పింది.మేం వెంటనే కుక్క కాదు టింకూ అన్నాం కోపంగా.మా ఫిజిక్స్ లెక్చరర్ కి కూడా మా టింకూతో పరిచయం ఉంది ఎలా అంటారా?నా ముందు సంవత్సరం ఫిజిక్స్ రికార్డ్ లో కొన్ని పేజీలలో బురదతో కూడిన రెండు,మూడు టింకూ పాదముద్రలు చూసి నన్ను తిట్టారు.మరేం చేస్తాం చక్కగా ఆరుబయట క్రిందనే కూర్చుని రికార్డ్ వ్రాసుకుంటూ కూడా టింకూతో ఆడేదాన్ని మరి.పాపం ఆయన కూడా మొహమాటానికి ఒక రెండు మూడు నిమిషాలు విచారించారు.ఆ తరువాత చాలా రోజుల వరకు ఏడుపు అవసరమైనపుడల్లా టింకూని తలచుకుని ఏడిచే వాళ్లం.అప్పటి నుంచి కనీసం నా అభిప్రాయం తీసుకోకుండా మా ఇంట్లో కుక్కపిల్లల పెంపకాన్ని నిషేధిస్తూ అమ్మ,పెద్దమ్మ ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.
తరువాత మామయ్య కూతురు మేఘన పెంచిన కుక్క తో స్నేహం పెరిగింది.తను పెళ్లయ్యాక అందరూ వద్దని మొత్తుకుంటున్నా వినకుండా కుక్కపిల్లని కూడా తనతో తీసుకు వెళ్లటం,కొన్నాళ్ల తరువాత డిసెంబరు 31వ తారీఖు రాత్రి ఆ కుక్కపిల్ల తప్పిపోవటం,తన ఏడుపు చూడలేక వాళ్లాయన రాత్రంతా కుక్కపిల్లని వెతికి తెచ్చేందుకు విఫల యత్నం చేయటం,ఇదంతా చూసి ఒళ్లు మండి వాళ్ల అత్తయ్య గారు వాళ్లింట్లో కుక్కలను నిషేధిస్తూ ఆఙలు జారీ చేయటం అదంతా ఒక కధ.
ఇలాంటి ఇంకా ప్రస్తుతం నాకు గుర్తుకు రాని బోలెడు సంఘటనల వలన మా ఇంట్లో పెద్దలకి,వాళ్ల ద్వారా మాకు కుక్కలను పెంచకూడదు అన్న భావం స్ధిరపడింది.
ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మా వారి ఉద్యోగరిత్యా,అమ్మ వాళ్లింటికి,అత్త గారింటికి దూరంగా ఇక్కడకొచ్చి పడిన మా జీవితంలోకి మా పక్కింటి మిక్కీ రూపంలో ఇంకో బుజ్జి కుక్క పిల్ల వచ్చి చేరింది.ఇంట్లో దిగిన మొదటి రోజు మాతో పాటు వచ్చిన ఆడపడచు కూతురు బుజ్జి జాహ్నవి ఆ మిక్కీ ని చూసి సంబరంగా కుక్కపిల్ల అని అరచినపుడు ఆ మాట వారికి వినపడకుండా తన నోరు జాగ్రత్తగా మూసేసి ఇంట్లోకి తీసుకెళ్లిపోయాం.ఎందుకంటే కుక్క ని కుక్క అంటే దానిని పెంచుతున్న వారికి ఎంత కోపం వస్తుందో అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి.మిక్కీ-వాళ్లింట్లో మనుషులతో సమానంగా తనని చూస్తారు.నేను,మా వారు వస్తుంటే మమ్మల్ని చూపించి మిక్కీ చూడు అన్న,వదిన వచ్చారు అంటుంటారు.మనసులో నవ్వుకుంటాను.పూజల దగ్గరకి తమతో పాటు తీసుకు వస్తారు.మొన్న వినాయక చవితి పూజలో వాళ్ల వెనకే మిక్కీ కూర్చుంటే పూజారి గారు వద్దంటే అంకుల్ కి బోలెడంత కోపం వచ్చేసింది.మా పిల్లలు ఎలా వచ్చారో అది కూడా అలాగే వచ్చింది తనని బయటకు పంపటం కుదరదు అయినా దేవుడి దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే అంటూ బోలెడు కోప్పడిపోయారు.ఉదయాన్నే ఐదు గంటలకి లేచి తలుపు తీసుకుని బయటకి వెళ్లగానే లోపలకి వస్తుంది అన్ని గదులు ఒకసారి చూసేసి బయటకి వెళ్లిపోతుంది.నిన్న సాయంత్రం కృష్ణ తో చిన్న గొడవ పడి ఈ రోజు ఉదయం కాస్త ఆలస్యంగా లేచి అలక నటిద్దామన్నా ఈ మిక్కీ వలన కుదరలేదు.ఉదయం ఐదింటికి అలారం కొట్టినట్లే వచ్చి తన కాళ్లతో ఆపకుండా తలుపు కొట్టటం మొదలు పెట్టింది.ఇక ఆ గోల భరించలేక అలక పక్కన పెట్టి లేవటం ఈయన చక్కగా ఒక చిరునవ్వు నవ్వుకోవటం జరిగాయి.మిక్కీ ని చూసి మురిసిపోతూ ఆంటీ చెబుతుంటారు మిక్కీ గాడికి పాలు,పెరుగు ఇష్టం అమ్మా కృష్ణాష్టమి రోజే చిన్నగా ఉన్నపుడు మేం తెచ్చుకున్నాం అని.
ఇంకో విషయం చెప్పటం మరచిపోయా.మేఘన కొడుకు అల్లరి చేసి వాళ్ల నాన్నమ్మ ని ఒప్పించి labrador జాతి కుక్కని తెచ్చి పెంచుతూ వాళ్ల నానమ్మ ని ఆ కుక్క ప్రక్కన నిల్చోపెట్టి ఫొటో తీసి ఆ ఫొటో ని వాళ్లింట్లో అందరి whatsapp ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టేసాడు.
గతంలో కుక్కలంటే పిచ్చిగా ఇష్టపడే మేఘన ఫోన్ లో అంటూ ఉంటుంది ఆ కుక్క ని పెంచటం కోసం వీడు పెట్టే ఖర్చుతో ముగ్గురు మనుషులని పోషించచ్చు ఈ కుక్క బాధ పడలేకపోతున్నాం అని.శుభ కూతురు రోజూ కుక్కని పెంచుతానని అల్లరి చేస్తుంటే వద్దని తనని ఒప్పించటానికి శుభ పడే బాధ వింటూ నవ్వుకుంటాను.నాకు కూడా ఇప్పుడు కుక్కల వాసనకి అలర్జీతో జలుబు వచ్చేస్తుంది.మిక్కీని దూరం నుంచి పలకరించి ఆడటమే కానీ ముట్టుకుని ఆడుకునే వీలు,ఆసక్తి ఉండవు.
ఒకసారి మేమందరం గతంలో చేసిన అల్లరి పనులను తలచుకుని నవ్వుకునే ప్రయత్నమే ఇది.మీలో చాలా మందికి ఇలాంటి ఙాపకాలు ఉండి ఉండచ్చు ఒకసారి మీరు కూడా తలచుకుని ఆ ఙాపకాల నవ్వులని ఆస్వాదించండి.
చక్కటి టపా. పిల్లలకి, జంతువులకి, పెద్దలకి అనుబంధం భలే వ్రాసారు. చిన్నప్పటి స్మృతులు ఎన్నో నెమరువేసుకొనేలా చేశారు. అమాయకత్వం, ఎందుకు చేయకూడదో తెలియని వయస్సు, షరతులు లేకుండా ప్రేమించటం పిల్లలకే సాధ్యం.
LikeLike
నా పోస్ట్ మీ చిన్నప్పటి స్మృతులు నెమరువేసుకునేలా చేయగలిగినందుకు సంతోషంగా అనిపించిందండీ.
LikeLike
భండారు శ్రీనివాసరావుగారి ఈ పోస్ట్‌లో ఆయన రాసిన స్టేట్బాంక్ అమ్మాయి గురించి చదవగానే ఎందుకో మీరే గుర్తొచ్చారు. అందుకే వెతుక్కుంటూ వచ్చి చెప్పాలనిపించింది. 🙂
https://bhandarusrinivasarao.blogspot.com/2017/11/blog-post_20.html
One request: Can you please allow blogger account to post comments instead of Google+ account?
~Lalitha TS
LikeLike
నా గురించి మీకు ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు,ఈ విషయం వెతుక్కుని మరీ
వచ్చి నాకు చెప్పినందుకు చాలా సంతోషంగా అనిపించిందండీ.
LikeLike