నువ్వు వస్తావు రెండు మూడు రోజులుండి వెళ్లిపోతావు.నువ్వు వెళ్లిన రోజు గదిలో తలుపేసుకుని ఎవరినీ కలవకుండా,ఏమీ మాట్లాడకుండా పడుకుండిపోవాలనిపిస్తుంది.నువ్వు వెళ్లిన రెండు రోజుల వరకు మా పడుకునే గది లో పడుకోకుండా నువ్వు ఆ రెండు రోజులు పడుకున్న మంచం పై పడుకుంటాను.నాకెపుడైనా బాగా దిగులుగా అనిపించినా,ఒంట్లో బాగులేక పోయినా నీ చీర నా చుట్టూ చుట్టుకుని పడుకుంటాను.ఏడుస్తాను ఆ చీర కొంగుతోనే కళ్లు,ముక్కు తుడుచుకుంటాను.నేనెప్పుడైనా నీ ఎదురుగా దిగులుగా కనిపించినా,ఒక్కోసారి ఏడ్చినా నువ్వు నన్ను పట్టుకుంటావు.నువ్వు నిల్చుంటావు,నేను కూర్చుని నీ నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుంటాను.నువ్వు మౌనంగా నీ చీర కొంగుతో నా ముఖం తుడుస్తావు ఆ కాసేపటిలో ఆ స్పర్శలో నీ నుంచి నా లోకి ఓదార్పు,ధైర్యం అన్నీ ప్రసరించేవి.నువ్వు వస్తావు నేను నీ వెనకే తిరుగుతుంటాను నువ్వు రోజులో కనీసం రెండు సార్లైనా అంటావు మీ అత్తగారిని కూడా ఇలాగే చూసుకోవాలి నువ్వు అని.ఉన్నంత సేపు మొహమాటం గా ఎవరో బయటి వాళ్ల ఇంట్లో ఉన్నట్లు ఇబ్బందిగా ఉంటావు.నిన్ను బయటకి తీసుకు వెళ్లి అన్నీ చూపించాలని ఎంత ఆశగా ఉంటుందో తెలుసా?కానీ రమ్మని పిలిస్తే రావు నీరసంగా ఉంది రాలేను అని అబద్ధం చెబుతావు.నువ్వు వస్తే నేను,కృష్ణల సరదా కి అడ్డంగా ఉంటావేమో అని మనసులో అనుకుంటావు.నాకెంత కోపమొస్తుందో తెలుసా?నువ్వు,నాన్న నా చిన్నపుడు నన్ను ప్రతీ దగ్గరకి తీసుకు వెళ్లేవారు కదా ఇప్పుడు మరి నువ్వెందుకు నాతో రావు అని గొడవ పెట్టాలనిపిస్తుంది. నాకెంత బాధనిపిస్తుందో తెలుసా?నీకు గుర్తుందా నాన్న చనిపోయిన రెండు మూడేళ్ల వరకు బయటి ప్రపంచం చూడటానికి ఇష్టపడే దానివి కాదు ఆఖరకు మేడ మీదకు కూడా వచ్చేదానివి కాదు.కానీ నాన్న సంవత్సరీకం రోజు మేడ పైకి విస్తరాకులో అన్నీ వడ్డించి తెచ్చి కాకులకు పెట్టే దానివి ఆ రోజు నీ కనుల లోని నీరు అర్ధం చేసుకునే వయసు రాక ముందు ఎంతగా సరదా పడి మేడ మీద మొక్కలు,మేడ పై నుంచి ఊరు నాకు ఆశ్చర్యం అనిపించిన అన్నీ అమ్మా అది చూడు ఇది చూడు అని చూపించేదాన్ని.నువ్వేమో మెత్తగా నా తల నిమిరి మెట్లపై కాసేపు కూర్చుని క్రిందకు వెళ్లేదానివి.
నీకు గుర్తుందా వేసవికాలంలో విశాలంగా ఉండే మన ఇంటి మధ్య గదిలో క్రిందనే తలగడ వేసుకుని చుట్టూ పుస్తకాలు(నేనేమో చందమామ,బుడుగు,అత్తగారి కధలు,chicken soup for the soul series,nicolas sparks The last song పుస్తకాలు,నువ్వేమో వారపత్రిక లు,జీవిత కధల పుస్తకాలు)చదువుకుంటూ కబుర్లాడుకుంటూ తలగడతో పాటు ఇంట్లో నేలంతా బద్ధకంగా తిరిగే వాళ్లం.ఎంత బాగుండేవి ఆ వేసవి కాలపు సెలవుల బద్ధకపు మధ్యాహ్నాలు.ఇప్పడేమో ఆ పక్కిింటి పిల్ల రాక్షసి కావ్య నా స్థానాన్ని ఆక్రమించేసింది అని చెబుతూ నవ్వుతుంటావు నువ్వు.
ఈ మధ్య నీకు కాస్త ఆరోగ్యం బాగులేకపోతే వయసు పెరుగుతుంది కదా ఇబ్బందులు తప్పవు అని డాక్టర్ గారు అన్నారని చెప్పావు ఎందుకో ఆ మాట నీ విషయంలో విని జీర్ణించుకోలేకపోయాను.ఉద్యోగం చేస్తూ ధైర్యం,గాంభీర్యం అనే ముసుగు బయటకి వేసుకుని తిరుగుతున్నా నీ విషయంలో మాత్రం అమ్మ కనిపించకపోతే గుక్కపట్టి ఏడ్చే పసిదాన్నే అమ్మా ఇంకా.ఎవరైనా ఎక్కడైనా తల్లిదండ్రులు కొడుకు ఇంట్లో ఉండటానికి హక్కు ఉంటుంది కూతురింట్లో ఉండకూడదు లాంటి మాటలు మాట్లాడితే విని నీ ముఖం లో బాధ లాంటి ఆ భావం నేనసలు చూడలేను తట్టుకోలేను.అమ్మ కు,కూతురికి మధ్య బంధం గాఢత వారిద్దరికీ తప్ప ఇంకెవరికమ్మా అర్ధమవుతుంది?మళ్లీ ఎప్పుడొస్తావమ్మా?
NICE
LikeLike
Meeru mee amma garini mee intiki tecchukuni, mee kadupuna puttina pillani choosukunnattu choosukovalani korukuntunnaa..
LikeLike
అమ్మకి నచ్చచెప్పి తీసుకొచ్చేసి మీతోనే వుంచేసుకోండి
LikeLike
అమ్మలని తీసుకొచ్చి కాపురాలు కూల్చుకుంటున్న వారిని చూసాను. అమ్మలని ప్రేమగా తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఆయాలుగా మార్చిన వాళ్ళనీ చూసాను. అమెరికాలో ఉంటున్న ఒక కూతురు అయితే నువ్వు వచ్చి మా పిల్లలని చూడకపోతే నేను ఉద్యోగం మానేస్తాను అనే బెదిరింపు ఒకటి. అమ్మని తీసుకొస్తే అత్తకీ, అమ్మకీ సరిపడదు కాబట్టి వేరు కాపురం అయితేనే కాపురానికి వస్తాను అనే వాళ్ళనూ చూసాను. అమ్మనీ, అత్తనీ చూసుకునే వాళ్ళకి నా ప్రణామాలు !
ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి. ఎక్కడి వాళ్ళక్కడే ఉండడం అందరికీ ఆరోగ్యకరం. పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాలేదు అంటే భర్త/భార్య ఒప్పుకోకపోతే ఎదిరించి తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం మానవత్వం ! ఇపుడు కొడుకు,అల్లుడు/కూతురు,కోడలు కూడా అత్తమామలను/తల్లిదండ్రులను వృద్దాప్యంలో చూసుకోవాలి అనే చట్టం కూడా వచ్చింది. ఆరోగ్యం బాగులేనపుడు చూసుకుంటే చాలు. ఉన్న ఊరిని వదిలివెళ్ళడం అందరికీ ఇష్టం ఉండదు. పల్లెలో ఇపుడు పనిమనుషులు దొరకడం లేదు. పరిస్థితులను బట్టి సర్దుకోవాలి. వృద్ధాశ్రమాలు ఎలానూ ఉన్నాయి. వృద్ధాశ్రమంలో ఉండడం ఇపుడు నాగరికత !
LikeLike
అత్తగారిని తన ఇంట్లో ఉంచడం, సరిగ్గా చూసుకోవడం ఆ అల్లుడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది (అలాగే తన అత్తగారిని తన ఇంట్లో ఉండనివ్వడం, సరిగ్గా చూసుకోవడం కోడలి సంస్కారం మీద ఆధారపడుంటుంది లెండి🙂. పెద్దలయెడ బాధ్యత నెరవేర్చడం భారతీయ జీవనవిధానంలో భాగం. అదే హుందాతనాన్ని ఇస్తుంది, అదే కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుంది. కానీ ఇప్పుడంతా మారిపోతోందిగా).
నా మిత్రుడొకతని అత్తగారు తను (అత్తగారు) పోయేటంతవరకు … చాలా సంవత్సరాలు … అల్లుడి ఇంట్లోనే ఉన్నారు. మరొక మిత్రుడి మేనమామ గారి భార్య తన భర్త (నా మిత్రుడి మేనమామ) పోయిన తరువాత గత ఇరవై ఏళ్ళ పైగా తన కూతుళ్ళ దగ్గరే ఉంటున్నారు. ఇలాంటి ఉదాహరణలు లేక పోలేదు … అయితే కాస్త అరుదు. అటువంటి ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తన తల్లిగారి పరిస్ధితి, తన కుటుంబ పరిస్ధితిని పరిశీలించుకుని, సంప్రదించి చిత్రా లక్ష్మణ్ గారు సరైన నిర్ణయం తీసుకుంటారని నా నమ్మకం.
అయితే ఇక్కడ పెద్దలమాట ఒకటి మాత్రం తలుచుకోక తప్పదు. తప్పనిసరి పరిస్ధితులలో అయితే వేరే సంగతి గానీ సాధ్యమైనంత వరకు, ఓపిక / శక్తిసామర్ధ్యాలున్నంత వరకు .. నీహారిక గారు కూడా అన్నట్లు .. ఎక్కడివాళ్ళు అక్కడ ఉండడమే వారికి గౌరవప్రదం. ఎందుకంటే :- 👇
తమ తమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తధ్యము సుమతీ.
——————
నెలవు దప్పు చోట నేర్పరి కొఱ గాడు!
విశ్వదాభిరామ వినర వేమ.
LikeLike
@ *,
మాకు తెలిసిన వారొకరు అక్కచెల్లెళ్ళిద్దరూ తమ తమ భర్తలతో కలిసి ఉంటున్నారు.సాధారణంగా తోడళ్ళుళ్ళకి/తోటికోడళ్ళకీ సరిపడదు కదా ? అన్నదమ్ములు కలిసి బ్రతకలేని పరిస్థితులలో అద్దెల భారం భరించలేక అక్కచెల్లెళ్ళు కలిసి ఉండడం అనివార్యమైంది. అలాగే అనివార్య పరిస్థితులు వచ్చేవరకూ ఎవరూ కూడా తల్లిదండ్రులను చూడరు.ఇపుడు ఎవరికీ(తల్లిదండ్రులకు కూడా) తమ తమ స్వేచ్చా స్వాతంత్ర్యాలు పోగొట్టుకోవడం ఇష్టం లేదు.
నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే మగపిల్లలు లేని తండ్రులు అల్లుడిని కొడుకులాగా తమని చూసుకోవాలని డిమాండ్ ఒకటి.తన పెళ్ళాం తనతో ఉండాలి తన అల్లుడూ తనతోనే ఉండాలి అనేది వీరి కోరిక.వాళ్ళకి కొడుకులు లేకపోవడం అల్లుడికి పట్టిన ఖర్మా ? కొడుకులున్న తల్లిదండ్రులని ఎవరు చూసుకోవాలి? ఎవరు ఎవరిని చూసుకోవాలి అనే విషయంలో క్లారిటీ లోపిస్తోంది.ఎవరి తల్లిదండ్రులను వారి పిల్లలే సమానంగా చూసుకోవాలి అనేదే మొన్న చేసిన చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం !నాకు అదే సరి అయినది అనిపిస్తుంది.
LikeLike
ఎక్కడి వాళ్లు అక్కడ ఉండటమే గౌరవప్రదం మా అమ్మ గారు ఇలాగే అంటారండీ.నేను కూడా ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తుంటాను.మీ విలువైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలండీ
LikeLike