ఎన్నాళ్ళ తరువాత ఇలా కూర్చోగలగటం.మౌనంగా…..ఎన్ని ఆలోచనలు,ఙాపకాలు… కన్నీళ్ళు తెప్పించేవి,సేద తీర్చేవి,భద్రంగా దాచుకోవాలనిపించేవి.
మహాలక్ష్మి మామ్మ చనిపోయింది నాలుగు నెలల క్రితం.రాలేకపోయాను.తనతో నాకు చుట్టరికం చెప్పమంటే తాత గారి చెల్లెలి కోడలు…కొంచెం దూరం చుట్టరికమే అనిపిస్తుంది కదా .కానీ రాళ్ల ముక్కుపుడక మెరుస్తుండగా తన నవ్వు నేను కళ్లు మూసుకోగానే సజీవంగా కనిపిస్తుంది.ఇంటి మధ్యలో దానిమ్మ చెట్టు,చెట్టు చుట్టూ గుండ్రని చిన్న అరుగు,ఇటు వైపు పన్నెండు మెట్లు,అటు వైపు వంట చేసుకునే పంచ,దాని వెనకే గిలక బావి,దాని చుట్టూ పెద్ద చెట్లు,ఇటు వైపు మెట్లు ఎక్కి పైకి రాగానే ఇనుప ఊచల తలుపు,తరువాత చిన్న వసారా,ఒక మూలగా చిన్న,అందమైన దేవుడి గది,వసారా ముందు పక్కపక్కన రెండు గదులు,ఎడమ వైపు గదిలో గుండ్రని అద్దాన్ని తలుపులో ఇముడ్చుకున్న చెక్క బీరువా.ఇంటి ముందు తులసి మొక్క,విరజాజి పందిరి,రాధామనోహరాల మొక్క.మహాలక్ష్మి మామ్మ….మామ్మ పేరు నాకు తెలీదు…నా భాషలో మామ్మ పేరు గుమ్మాన మామ్మ,తాత గారి పేరు ఇప్పటికీ తెలియదు.మా ఇంటి గుమ్మం లో వాళ్ళ ఇళ్లు.అందుకే గుమ్మాన మామ్మ,తాతయ్య.గిలక బావి చుట్టూ ఉన్న చెట్ల సందుల్లోంచి వచ్చే ఎండతో దాగుడుమూతలాట,మెట్ల మీద గెంతుతూ ఆడుకునే ఆట,బీరువా తలుపు అద్దంలో మొన్నమొన్నటి వరకు నన్ను నేను ఇష్టంగా చూసుకోవటం,ఇంటి ముందు విరజాజి పూవుల వాసన ఇవన్నీ ఎంత ఇష్టమో మామ్మ అంటే అంత ఇష్టం.మెట్ల పై చిన్న గౌను వేసుకున్న పాప,స్వచ్ఛమైన నవ్వున్న మామ్మ మాట్లాడుతూ వాళ్ళ వయసును మరచి నవ్వుకునే స్నేహం ఎంత అందంగా ఉంటుందో.అసలు ఆ దానిమ్మ చెట్టు,ఆ మెట్లు,ఆ దేవుడి గదిలో ధూపం మధ్యలో చల్లగా నవ్వే మామ్మ,ఆ ఇళ్లు అది చివరి శ్వాస వరకు మరచిపోకూడదనుకునే అత్యంత అపురూపమైన విషయం.బొమ్మలేసే విద్య నాకు రాదు ఆ దృశ్యం భద్రపరచుకోవటానికి.నా మురారి మామ్మ ఇంట్లో మెట్ల మీద ఆడుకుంటుంటే గోరుముద్దలు తినిపించాలనే కోరిక తీరలేదు.మెట్ల పై కూర్చుని మాటల్లో వ్యక్తం చేయలేని బెంగని దానిమ్మ చెట్టు తో మౌనంగా చెప్పుకుందామంటే ఇంటికి తాళం……ఊరిలో ఇంకో అందమైన ఇంటికి తాళం.పల్లెల్లో విశాలమైన ఇళ్లకి తాళాలు పడిపోతున్నాయి పట్టణాల్లో గాల్లో కట్టిన మేడలు కోట్లు పెట్టి కొనుక్కుంటున్నాం.

బహుకాల దర్శనం. బాగున్నారా? ఆ బ్యాంక్ ఉద్యోగమేనా?
ఆ పాతకాలపు ఇంటి ఫొటో చాలా బాగుంది – ముఖ్యంగా ఆ వీధి అరుగులు. మీరన్నట్లు అవన్నీ మాయమైపోతున్నాయి.
LikeLike
బాగున్నానండీ.బ్యాంక్ ఉద్యోగం లోనే ఉన్నాను.ఫొటో నచ్చిందన్నారు ఇల్లు ఫొటో కంటే కూడా బాగుంటుందండీ.నన్ను గుర్తు పెట్టుకుని పలకరించినందుకు మీ కామెంట్ చూడగానే సంతోషంగా అనిపించింది.
LikeLike