mahivishnupriya

నా భావాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం

ఎర్రని తురాయి పూలు

పైన కనిపిస్తున్న పేరుకి ఇందులో విషయానికి ఎటువంటి సంబంధం లేదు.ఉదయం బోలెడు ముదురు ఎరుపు రంగు తురాయి పూలు చూశాను.ఏం పేరు పెట్టాలో తెలియక వాటి పేరు పెట్టేశానన్న మాట.చాలా రోజులైంది బ్లాగ్ లో వ్రాసి.పంచుకోవటానికి బోలెడు కబుర్లు.కానీ ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో తెలియటం లేదు.

                             ఉద్యోగంలో బదిలీ అయింది.అమ్మ వాళ్లింటికి,అత్త గారింటికి దూరంగా.కృష్ణ ఉంటున్న దగ్గరకి 70 కి.మీ. దూరంలోకి.పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోకి,బస్సు సౌకర్యం కూడా లేని దగ్గరకి.కొండ ప్రక్కనే ఊరు.బ్రాంచ్ మేనేజర్ గారు అన్నీ ఎంత పద్ధతిగా ఉంచుకున్నారో.అలా ఉంచుకోవటం నేర్చుకోవాలి.ఊరంతా పచ్చగా ప్రతీ ఇంటి ముందు బోలెడు మొక్కలు.రోజూ ఆఫీస్ నుంచి కృష్ణ  దగ్గరకి ఇంటికి వెళ్లేసరికి రాత్రి అయిపోతుంది.అమ్మ రోజూ ఫోన్ చేసి అంటుంది నువ్వు లేకపోవటం ఇల్లంతా ఖాళీగా ఉన్నట్లనిపిస్తుంది అని.

                              కొత్తగా,పూర్తిగా పరిచయం లేని వాతావరణం.15కి.మీ. దూరంలో బస్సు దిగి ఆటోలో వెళుతుంటే త్రోవంతా చింత చెట్లు,ఎర్రని కృష్ణ తామర పూలు.చింత చెట్ల నిండా పూలు.నిండా ఆకుతో గోరింటాకు చెట్లు.చుట్టూ పొలాలు,మధ్యలో ఇళ్లు.ఎంత ప్రశాంతంగా ఉంటాయో.ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు అక్కడకి వెళ్లటం.కానీ ఉద్యోగం చేస్తున్నపుడు అందులో మార్పులకు సిద్ధం కావాలి మరి.

                             రోజూ దాదాపు రెండు గంటల బస్సు ప్రయాణం.బస్సులో ఒక్కోరోజు ప్రక్కన కూర్చున్న వాళ్లతో కలిసే మాటలు.ఉదయం ఇంటి దగ్గర నుంచి వెళ్లేటపుడు బస్ లో అందరూ నాలాగ వేకువనే లేచి వంట చేసుకుని,ఇంటి పనులు చేసుకుని అలసి పోయి లంచ్ బాక్స్ బ్యాగ్ తో పరుగెడుతూ ఆఫీస్ కి బయలుదేరే వాళ్లే.బస్ ఎక్కి టికెట్ తీసుకోగానే నిద్ర లోకి జారిపోయే వాళ్లమే దాదాపుగా అందరమూ.ఈ జీవితపు పరుగులో అలసిపోతూ,కుటుంబాన్ని,ఉద్యోగాన్ని  బ్యాలెన్స్ చేసుకోవలసిన విషయంలో ఒత్తిడికి గురవుతూ,అటు ఉద్యోగాన్ని వదులుకోలేని మధ్యతరగతి అశక్తత కొంతమందిలో,తాము ఉద్యోగం చేయకపోయినా భర్త సంపాదనతో ఇల్లు గడిచే స్థోమత ఉన్నప్నటికీ తమకంటూ సమాజంలో ఒక గుర్తింపును తీసుకొచ్చిన ఉద్యోగంపై ఇష్టంతో ఉద్యోగం వదలలేని వారు ఇంకొంత మంది.ఎంత కష్టమైనప్పటికీ ఆ ఒత్తిడి ఏదో రకంగా దాటేసి పరుగెడుతుంటాం.ముఖాలపై అబద్ధమో,నిజమో,మనలాంటి వాళ్లే చుట్టూ కనిపిస్తుంటే అనుకోకుండా కొంత సమయానికి ఏర్పడే బలహీనమైన అనుబంధమో అందరి ముఖాల్లోనూ చిరునవ్వు రూపంలో కనిపిస్తుంటుంది.కొంతమంది బస్ ఎక్కగానే ఇయర్ ఫోన్ చెవిలో పెట్టేసుకుని,పాటలు వింటారు.ఇంకొంతమంది దేవుడి సహస్ర నామాల పుస్తకాలు చదువుకుంటారు.ఇంకొంత మంది నిద్ర లోకి జారుకుంటారు.ఇంకొంతమంది అందరూ కట్టుకున్న చీరలు,చుడీదార్ లు,గాజులు గురించి కబుర్లు చెప్పుకుంటారు.ఇంకొంతమంది కిటికీ లోంచి రోజురోజుకి కొత్త కొత్త గా ముస్తాబవుతున్న ప్రకృతిని చూస్తూ ఉంటారు.

                          ఇంటికి వెళ్లేసరికి రాత్రవుతుంది.షాపింగ్ మాల్స్,నగల షాపుల్లో యూనిఫామ్ చీరల్లో చిరునవ్వుతో కష్టమర్లకి నమస్కరిస్తూ ఉండే అమ్మాయిలు పని ముగించుకుని ఆ కృత్రిమ ప్రపంచం,చిరునవ్వుని వదిలేసి ఇంటికి వెళ్లేందుకు ఆటోల కోసం పరుగెడుతుంటారు.కాంప్లెక్స్ కి కృష్ణ వస్తారు నన్ను తీసుకెళ్లటానికి.ఐదు నిమిషాలు నడచుకుంటూ ఇంటికి వెళ్తాం.ఎంత లేటయినా పక్కింటి ఆంటీ,అంకుల్ మేలుకునే ఉంటారు నన్ను పలుకరించేసి వెళ్లి పడుకుంటారు.

                        త్రోవలో మెయిన్ రోడ్ ప్రక్కనే వైన్ షాప్ ముందు ఒకమ్మాయి బజ్జీలు లాంటివి ఏవో వేస్తుంటుంది తను కాదు గానీ తనతో పాటే ఒక చిన్నమ్మాయి ఏడేళ్లు ఉంటాయేమో నిల్చుంటుంది ఒక్కోరోజు.రోజూ ఆ చిన్నమ్మాయి ఉంటుందేమో అని కళ్లు వెతుకుతాయి తను లేని రోజు మనసుకు బాగున్నట్లనిపిస్తుంది.మరీ లేటయిన రోజు(ఎనిమిదిన్నర దాటిపోతే)కాంప్లెక్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బోలెడు మేకప్ వేసుకుని ఇద్దరు ముగ్గురు యువతులు నిల్చుంటారు మొదట్లో అయోమయంగా అనిపించేది.కృష్ణ దిక్కులు చూడకు వేగం నడు అంటుంటారు.భయమో ఏదో అర్ధం కాని ఫీలింగ్.ఎప్పుడూ చూడని,చూసి భరించలేని చీకటి కోణం అది.సమాజంలోని దుర్మార్గం,మనుషుల్లోని చీకటి,దైన్యం మనుషుల రూపంలో ఎదురుగా ఉన్నట్లనిపిస్తుంది.వీళ్ల బ్రతుకులు మారితే బాగుణ్ణు అని మనస్ఫూర్తిగా అనుకుంటాను.ఈ విషయం మాట్లాడటం మీలో చాలా మందికి రుచించకపోవచ్చు.కానీ పరిస్థితులు అనుకూలిస్తే,మంచి తల్లిదండ్రులు ఉంటే వాళ్లు కూడా మనలాగే సమాజంలో గౌరవంగా,హుందాగా బ్రతికి ఉండేవారేమో.కామెడీ షో పేరుతో వికారపు మాటలు,చేష్టలు టి.వి. లో కనిపిస్తాయి కదా దానికంటే అధ్వాన్నం  కాదేమో ఈ విషయం గురించి మాట్లాడటం.

క్రిందటి వారం అత్తగారింటికి వెళ్లి అత్తమ్మ తో,గర్భవతిగా ఉన్న ఆడపడచు తో అర్ధరాత్రి వరకు కబుర్లాడుకుని వెళ్లాను.ఈ వారం అమ్మ  వాళ్లింటికి వచ్చాను.ఈ ఇల్లు,ఈ ఊరు నాకెంతో ఇష్టమైన ప్రపంచం.ఈ 15 రోజుల్లో ఇంటిపై ఎంతగా బెంగ పెట్టుకున్నానో.చెరువు,చెరువు గట్టునే ఉన్న శివాలయం,రామాలయం,నిండా ఎర్రని పూలు నింపుకుని ముస్తాబైన తురాయి చెట్టు ఎంతందంగా ఉన్నాయో.మేడ మీద గది కిటికీ తెరచి పెట్టి హరిహరన్ గొంతునో,వేటూరి గారి సాహిత్యాన్నో,ఇళయరాజా,ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నో వింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో.నిన్న టి.వి.లో “ఒక మనసు” సినిమా చూశాను.ఆ సినిమా,అందులో ఇమిడిపోయిన బాధ చాలా సేపు వెంటాడాయి.

                    ఈ మధ్య గొల్లపూడి మారుతీరావు గారి”రుణం” పుస్తకం చదివాను.చాలా నచ్చింది.ఆ పుస్తకం గురించి వ్రాయాలనుకున్నాను కానీ అంత మంచి పుస్తకం గురించి వ్రాసేంత సామర్థ్యం నాకు లేదేమో అనిపించి ఆ ధైర్యం చేయలేదు.ఒక రోజులో కంగారుగా చదివేశాను ఈ సారి తీరికగా ప్రతీ వాక్యాన్ని ఆస్వాదిస్తూ చదవాలి.ఆ తరువాత పుస్తకం గురించి నాకు తోచినట్లు గా నేను వ్రాయటానికి ప్రయత్నిస్తాను.వేదాల లోని పవిత్రత,చీకటి ప్రపంచంలోని విచ్చలవిడితనం,తెగింపు రెండూ కనిపిస్తాయి.చెడుని మంచితో ఎలా మార్చవచ్చో కనిపిస్తుంది.పుస్తకంలో చాలా సేపు కనిపించే అగ్రహారం,వేద ఘోష మనసుకి చాలా నచ్చాయి.నిజ జీవితంలో కలలో కూడా ఊహించలేనంత మంచితనం అబ్బుశాస్త్రి పాత్రలో మనకు కనిపిస్తాయి.

“ఐశ్వర్యాన్ని,విద్యతో బేరీజు వేసుకుని,సంపన్నతని సంస్కారంతో కొలుచుకుంటున్న రోజులవి.” అంటూ మొదలు పెట్టి చివరలో “మంచితనం వైరస్ లాంటిది.అది నిదానంగా-కాని స్పష్టంగా ఆవరించుకుంటుంది.కృతఙత,ఉదాత్తత దాని కవల పిల్లలు” అంటూ ముగిస్తారు.అబ్బు శాస్త్రి,చయనులు గారు,సోమిదేవమ్మ,సర్వమంగళం,అనసూయ పవిత్రతకు మానవ రూపంలా కనిపిస్తారు.మిగిలిన పాత్రలన్నీ మంచితనం పరిమళం అనుభవించి మంచితనాన్ని వెదజల్లుతూ కనిపిస్తాయి.ఆ పుస్తకం చదివాక గొల్లపూడి మారుతీరావు గారి”సాయంకాలమైంది” పుస్తకం కోసం ప్రయత్నించాను.దొరకలేదు.

బద్ధకపు వర్షాకాలపు ఉదయాలు,పెరటి నిండా రంగురంగుల పూలతో మొదలయ్యే చలికాలపు ఉదయాలు,రామాలయం నుంచి ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి  గొంతులో వినిపించే సుప్రభాతమో,భక్తి గీతాలతోనో మొదలయ్యే ఉదయాలు,సన్నజాజుల పరిమళాలద్దుకున్న సాయంత్రాలు,పారిజాతాల నిరాడంబరతను నింపుకుని,దీపపు వెలుగులలో అందంగా ఉండే దేవుని గది,అమ్మ చేసే పచ్చళ్ల ఘమఘమలు నింపుకున్న వంటిల్లు,కిటికీలో నుంచి ప్రసరించే తొలి సూర్యకిరణాల వెలుగుతో అందం సంతరించుకునే నా చదువుకునే గది- ఇల్లే కదా ప్రపంచమంతటిలో హాయిగా అనిపించే ప్రదేశం.

                    ఆఫీస్ లో ఉన్నంతసేపు ఉద్యోగం చాలెంజింగ్ గా ఉంది బాగుందనిపిస్తుంది.ఇంటి కొస్తే చాలెంజింగ్ లేదు ఏం లేదు ఇంటి దగ్గర లో ఉండి దూరం బదిలీలు లేని ఉద్యోగమైతే బాగండనిపిస్తుంది.ఇక ఉంటానేం ఇప్పటికే ఎక్కువైంది నా సొంత గోల.

Advertisements
2 Comments »

చెలియా….

 కొన్ని సినిమాలు చూసిన వెంటనే బాగున్నాయనిపిస్తాయి.కానీ ఒకరోజు గడిచే సరికి సినిమా గురించి మరచిపోతాం.ఇంకొన్ని సినిమాలు చూస్తుంటే మొదలైన అరగంటకే బయటకి వెళ్లిపోవాలనిపిస్తుంది.నిన్న ఆదివారం చెలియా సినిమా చూశాం.ఇద్దరికీ నచ్చింది.ఒకరోజు గడిచాక ఈ రోజుకి కూడా సినిమా బాగుంది కదా అనిపించింది.

               మణిరత్నం గారి సినిమా అనగానే వెళ్లాలి అనుకున్నాం.(కడలి,విలన్ సినిమాలు భయపెట్టాయి అన్నది మాత్రం నిజం.)వెళ్లే ముందు రివ్యూలు చదివి సినిమా బాగులేదా అని చాలా నిరాశగా అనిపించింది.కానీ ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల వలన ఇలాంటి రివ్యూలు,రేటింగ్ లు నమ్మటం మానేశాం కాబట్టి ఆదివారం మధ్యాహ్నం చెలియా సినిమాకి వెళ్లాం కృష్ణ,నేను.అందరూ చెప్పినట్లుగా సినిమా చూస్తుంటే విసుగ్గా ఏం అనిపించలేదు.Armed forces నేపధ్యంలో సినిమా తీయటం వలనేమో ఇంకా బాగా నచ్చింది.మా ఇంట్లో ముగ్గురు ఆర్మీ ఆఫీసర్స్(ఒకరు మేజర్,ఇంకొకరు రిటైర్డ్ మేజర్,ఇంకొకరు కల్నల్) ఉండటం వలన,వీరి ముగ్గురిలో ఇద్దరు యుద్ధం సమయంలో పనిచేసి ఉండటం వలన, చిన్నప్పటి నుంచి త్రివిధ దళాలకు సంబంధించిన విషయాలు వింటూ,వాటికి సంబంధించిన ఫొటోలు చూస్తూ పెరగటం వలనేమో సినిమాలో కనిపించిన ఆర్మీ సంస్కృతి పరిచయమున్నట్లుగానే అనిపించింది.హీరో మొండి ప్రవర్తన విసుగ్గా,విచిత్రంగా అనిపించలేదు.పైగా సినిమా అంటే మరింతగా ఇష్టం పెరిగింది.నేను చూసినంత వరకు మణిరత్నం గారి సినిమాల్లో ఆర్మీ నేపధ్యం కనిపించినంత అందంగా ఇంకే సినిమాలో నాకు కనిపించలేదు.

“They are not heroines,they are characters,They all have a mind of their own.”అని మణిరత్నం గారు తన సినిమాల్లోని కధానాయిక పాత్రల గురించి చెప్పినట్లు మణిరత్నం సినిమాల్లోని హీరోయిన్లకు తమకంటూ బలమైన వ్యక్తిత్వం,సొంత ఆలోచనలు ఉంటాయి.చాలా వరకు ఆయన సినిమాల్లో గమనించినంత వరకూ ఆ కధానాయిక పాత్రల ప్రవర్తనను కట్టడి చేయాలని ప్రయత్నించే కుటుంబ సభ్యుల పాత్రలు అంతగా కనిపించవు ఆయన సినిమాలలో.ఈ సినిమాలో అదితీరావ్ హైదరీని చూస్తున్నంత సేపు కనులకు చాలా హాయిగా అనిపించింది.తన వస్త్రధారణ కూడా చాలా హుందాగా అనిపించింది.అసలు ఈ సినిమా నాకు నచ్చటానికి ఉన్న కారణాలలో కధానాయిక నటన,అందం అతి ముఖ్యమైనవి.తన స్నేహితురాలిగా నటించిన రుక్మిణి విజయకుమార్ కూడా బాగున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ ఇల్లు,ఆ ఇంటి అలంకరణ చాలా నచ్చింది.లొకేషన్స్ చాలా బాగున్నాయి.రవివర్మన్ గారి అత్యంత అందమైన కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే.ప్రతీ ఫ్రేమ్ అందంగా ఇంకా చూడాలనిపించేలా ఉంది.
          ఎ.ఆర్.రెహమాన్ గారి నేపధ్య సంగీతం కొన్ని చోట్ల సన్నివేశాలకు మరింత అందాన్ని అద్దినట్లు అనిపించింది.రెండు పాటలు బాగున్నాయి.సినిమా అయిపోయాక నేను,కృష్ణ సినిమాకి 5/5 రేటింగ్ ఇచ్చేసుకున్నాం.ఆఫీసర్ వి.సి.,లీలా అబ్రహం పాత్రలు బాగున్నాయి కదా అనుకున్నాం.అందరూ ఇచ్చే రివ్యూలు,రేటింగ్ లు మాకు సరిపోవని నవ్వుకున్నాం.వచ్చేస్తుంటే ఎవరో ఇంకొకతనితో అంటున్నాడు”ఏ పిచ్చోడు రా ఈ సినిమా బాగుందని నీకు చెప్పాడు” అని.ఆ చెప్పినతను ఎవరో మన లాంటి వారే అని ఇంకోసారి నవ్వుకున్నాం.

బోలెడంత మేకప్ వేసుకుని కేవలం పాటలకు మాత్రమే పనికొచ్చే హీరోయిన్లు,చిన్న బట్టలు వేసుకున్న హీరోయిన్లు,అరగంట కొకసారి రక్తాలొచ్చేలా ఒకరే వంద మందిని కొట్టేసే ఫైట్లు,హాస్యం అంటూ ద్వంద్వార్ధపు మాటలు చూపించే వెకిలితనం ఇవేవీ కనిపించలేదు ఈ సినిమాలో.అందుకే హాయిగా అనిపించింది.

మణిరత్నం మ్యాజిక్ ఇలాగే ఉంటుంది ప్రత్యేకంగా,అందంగా,నిరాడంబరంగా,హాయిగా,కొంతమందికి మాత్రమే అర్ధమయ్యేలా(బహుశా మాలాంటి మణిరత్నం పిచ్చోళ్లకి మాత్రమే అర్ధమయ్యేలా.)

6 Comments »

ఇంకొన్ని నచ్చిన ఫొటోలు

1 Comment »

సెలవురోజు


ఇంట్లో(పుట్టింట్లో) మేడ మీద గదిలో కిటికీలు తెరచి పెట్టి కిటికీ లోంచి చెరువు గట్టు పైన శివాలయం,రామాలయాలను చూస్తూ రామాలయం నుంచి వినిపిస్తున్న భజన వినిపిస్తుంటే పక్కింటి మేడ పైకి ప్రాకిన సన్నజాజి తీగ నిండా విచ్చుకుంటున్న సన్నజాజి మొగ్గల వాసన,ఇంకో ప్రక్కన కొబ్బరి,మామిడి చెట్ట మధ్య లో నుంచి కనిపిస్తున్న మిణుకుమిణుకు మనే నక్షత్రాలు…..ఎన్నాళ్లయిందో ఇలా తీరికగా ప్రశాంతంగా కూర్చుని.సాయంత్రం చినుకులు పడ్డాయి కాబట్టి చల్లగా అనిపించింది.

                               పెళ్లయ్యాక జీవితంలో హడావుడి పెరిగిపోయింది.పెళ్లి జరిగి సంవత్సరమైంది.ఈ సంవత్సరంలో ఒక వారం రోజులు కూడా కుదురుగా ఒక దగ్గర ఉండటం లేదు.ఎప్పుడూ పరుగులే.

                    ఉదయం నుంచి సాయంకాలం వరకు బ్యాంకులో హడావుడి(అసలే ఈ మధ్య బ్యాంకుల్లో తిరునాళ్లని గుర్తు తెచ్చేలా జనాలు.)దానికి తోడు ప్రమోషన్ కూడా తీసుకున్నాను.ప్రమోషన్ బాధ్యతని పెంచుతుందని వ్యక్తిగత జీవితానికి సరిపడేంత సమయం కేటాయించలేమని తెలిసి కూడా ప్రమోషన్ వద్దనుకోలేని పరిస్థితి.ఎప్పటికైనా తీసుకోక తప్పదు ఇప్పుడు వద్దనుకుంటే భవిష్యత్తులో ఎప్పడో ఒకప్పడు వద్దనుకున్నందుకు బాధ పడవలసి వస్తుందని తెలుసు.అలా అని ఇప్పుడేమైనా ప్రశాంతంగా ఉన్నానా అంటే అదీ లేదు ఈ ప్రమోషన్ వలన ఎక్కడికి బదిలీ చేస్తారో అనే బెంగ.పని ఎక్కువగా ఉండి రాత్రి ఏడున్నరకి ఇంటికి చేరినపుడు ఎందుకు ఈ ప్రమోషన్ తీసుకున్నాను అనే ఆలోచన.ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ఎంత ఉత్సాహంగా ఉండేదో.హాయిగా నాకు ఇష్టమైన గ్రామీణ ప్రాంతంలో,ఇంటి దగ్గర నుంచి రోజూ వెళ్లి వచ్చేయగలిగేలా,చేస్తున్న పనికి కాస్త అర్ధం ఉండేలా,ఉద్యోగం వలన మానసికంగా కాస్త సంతృప్తి ఉండేలా ఉండేది.ఇప్పడదేంటో రోజూ గందరగోళంగా నిద్రలో కూడా బెంగగా ఉంటుంది రాత్రికి రాత్రి రాజకీయ నాయకుడి మెదడులో మళ్లీ ఏ కొత్త పధకం రూపు దిద్దుకుంటుందో అని.ఈ పధకాలన్నింటి సంగతేమో కానీ సామాన్యులు,నిరక్షరాస్యులు కష్టపడి సంపాదించుకుని దాచుకుంటున్న డబ్బులకి కూడా ప్రభుత్వం మాతో పెట్టిస్తున్న నిబంధనలు,అడిగిస్తున్న రుజువుల బాధ భరించలేక ప్రజలకి బ్యాంకులంటేనే విరక్తి ఏర్పడిపోయిందన్నది మాత్రం కళ్లకి కట్టినట్లు కనపడుతుంది.

ఉద్యోగంలో ముఖ్యమైన పనులకు కూడా సెలవులు దొరకవు.ఎప్పడో అందరినీ బ్రతిమలాడి ఒకరోజు సెలవు సంపాదిస్తే ఇక ఆ సందర్భంలో మాటలు కూడా రాక ఆనందబాష్పాలు వచ్చేసే పరిస్థితి😊.

అత్తగారిల్లు,పుట్టిల్లు దగ్గర కాబట్టి వారంలో ఇక్కడ కొన్ని రోజులు,అక్కడ కొన్ని రోజులు,వారాంతంలో నాలుగు గంటలు ప్రయాణం చేసి కృష్ణ దగ్గరకి వెళ్లి అక్కడ ఇల్లు సర్దుకుని,ఇంట్లో పనులు చేసుకునే సరికి ఆ రోజు కాస్తా గడచిపోవటం,సోమవారం వేకువ ఝామున బయలు దేరి రావటం మళ్లీ వారం రోజులు మామూలే.

 అమ్మ వాళ్లింట్లో వేకువనే మెలకువ వచ్చినా అమ్మ లేపేంత వరకు మంచం పైనే ఉండటం,అమ్మ మళ్లీ మళ్లీ లేపుతున్నా లేవకుండా తనని కాసేపు అల్లరి చేసి తరువాత లేస్తాను.అత్తగారింట్లో ఆరు తరువాత లేస్తే ఏమనుకుంటారో అని బాగా గుర్తు పెట్టుకుని మరీ వేగం లేచి కూర్చుంటాను.పెళ్లయ్యాక ఆడపిల్లకి పుట్టింట్లో కొన్ని పరిమితులు,మెట్టినింట్లో కొన్ని హక్కులు వస్తాయంటారు.పుట్టింట్లో తోడబుట్టిన వారు లేకపోవటం వలన ఇక్కడ పరిమితులు పాటించాల్సిన అవసరం ఇంకా రాలేదు.

వారాంతంలో కృష్ణ దగ్గరకి వెళ్లినపుడు ఇంట్లో పనంతా అయిపోయాక ఇంటి ముందు మామిడి చెట్టు ఎదురుగా మెట్లు పై కూర్చున్నపుడు విమానాలు ఇంటిపై నుంచి దగ్గరగా వెళ్తూ కనిపిస్తాయి.అలా దగ్గరగా చూడటం కంటే చిన్నపుడు ఆకాశంలో దూరంగా పక్షిలా కనిపించే విమానాన్ని అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి విచిత్రంగా చూసే వాళ్లం(ఇప్పటికీ ఊరిలో చిన్నపిల్లలు అలాగే చూస్తారు) అలా చూడటమే బాగుందనిపిస్తుంది.రోజులో ఒక్క సారైనా కృష్ణతో అంటాను మన ఊరి వైపు వెళ్లిపోదాం అని.కృష్ణ దగ్గరకి వెళ్లిన కొత్తలో కూరగాయలు తో పాటు కరివేపాకు,దేవుడికి పెట్టటానికి పూలు కొనుకుంటుంటే మనసొప్పేది కాదు(ఇంట్లో పెరట్లో బోలెడు ఉంటాయి మరి.)

ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనిపించి ఈ రోజు అమ్మ వాళ్లింట్లో ఉండిపోయా. ఎన్నాళ్లయిందో ఈ ఊరిని మనసారా తనివి తీరా చూసుకుని.మధ్యాహ్నం పై మేడమీదకి వెళ్లి చూస్తే చుట్టూ డాబాలపై మంచి పెయింటింగ్ వేసినంత అందంగా అందరూ  ఎండుమిరపకాయలు,చింతపండు,పెసలు,మినుములు ఎండబెట్టుకున్నారు.ఎంతందంగా అనిపించిందో.ఎంతైనా పల్లెటూరు అందమే వేరు.

చాలా రోజుల తరువాత నేను మీతో కబుర్లు చెప్పటానికొచ్చాను కదా అందుకే గుర్తొచ్చినవన్నీ ఒక వరుస,పద్ధతి అంటూ లేకుండా గబాగబా చెప్పేసానన్న మాట.ఏమీ అనుకోవద్దు.

10 Comments »

చలికాలపు ఉదయాలు

వణికించే చలి లో
పచ్చడి కోసం బొగ్గుల కుంపటి పై కాలుతున్న వంకాయల కమ్మని వాసన 

బొగ్గుల కుంపటి దగ్గరలో కూర్చుంటే ఆ వెచ్చదనం

కొన్ని చలికాలపు ఉదయాలు ఎంత హాయిగా ఉంటాయో.

కావ్య వస్తుందన్న విషయం నేను గమనించకుండా ఏదో చదువుకుంటున్నపుడు తన చిట్టి అరచేతులు రెండూ రాపిడి చేసి ఆ వేడి చేతులు నా బుగ్గలపై పెట్టి నిద్ర ముఖంతో ముద్దుగా చలి తగ్గిందా అని అడుగుతుంది తను.మనసుకి హాయిగా అనిపిస్తుంది.

Leave a comment »

అర్ధం చేసుకోరూ….

ఏదైనా విషయం గురించి ప్లాన్ చేస్తున్నపుడు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటూ సానుకూలంగా ఆలోచనలను కొనసాగిస్తుంటారు కృష్ణ(అదే మా వారి పేరు).నా నోరు ఊరుకోదుగా నేనేమో వెంటనే అలా జరగకపోతే….ఏం చేయాలో కూడా ఆలోచించి పెట్టుకోమంటాను.పాపం తను వస్తున్న కోపాన్ని అణచుకుని,ప్రశాంతతను బలవంతంగా గొంతు లోకి ,ముఖంలోకి తెచ్చి పెట్టుకుని”ఎపుడూ సానుకూలంగా ఆలోచించవేం” అంటారు.ఎక్కడైనా భార్యాభర్తలిద్దరు ఒకేలా ఆలోచిస్తారా?ఆయన అమాయకత్వం కాకపోతే😊.ఒకరు వేగంగా వెళుతుంటే ఇంకొకరు స్పీడ్ బ్రేకర్ లా వేగం తగ్గించేలా ఉండేవారినే కదా దేవుడు కలుపుతాడు.ప్రతీసారీ మనమనుకున్నట్లే జరగాలని లేదుగా దానికి వ్యతిరేకంగా కూడా జరిగే అవకాశం ఉందని మనసును సిద్ధం చేసి పెట్టుకోవటం మంచి పద్ధతి కదా.ఇదే చెబితే కోపంగా చూస్తారు.నాకపుడు స్వర్ణ కమలం సినిమాలో భానుప్రియ గారు అన్నట్లు”అర్ధం చేసుకోరూ….” అనాలనిపిస్తుంది.నాకు అంత సున్నితంగా,అందంగా అనటం చేతకాదు లెండి.ఇక మరీ ఎక్కువగా వ్రాసి ఇంకా మీ సమయం వృధా చేయాలంటే కాస్త మొహమాటం గా ఉంది.ఈ రోజుకి ఇది చాలు.ఇక ఉంటానేం.

ఈ ఫొటో కి పైన వ్రాసిన దానికి ఎటువంటి సంబంధం లేదు.ఈ ఫొటో నచ్చింది ఊరికే అలా పెట్టాలనిపించింది.

2 Comments »

అదృష్టం కాదు…విధి..అనండి.

బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్లేందుకు మెట్లు దిగుతుంటే ఎవరివో మాటలు అనుకోకుండా వినటం జరిగింది.ఎవరో వేరొకరి గురించి మూడో వ్యక్తితో చెబుతున్నారు.ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాకు మంచి జరుగుతుంది.ఆమె మాకు అదృష్ట దేవత అని.

                చుట్టూ ఉన్న ప్రపంచం కొంచెం కొంచెంగా అర్ధం కావటం మొదలైన దగ్గర నుంచి ఎపుడూ అనుకునే మాట మనసులో మెదిలింది.”ఈ రోజు నువ్వు అదృష్టం తెచ్చావు అంటే పొంగిపోకూడదు.అదృష్టానికి బాధ్యత  తీసుకునే ఉద్దేశ్యం ఉంటే రేపటి రోజున చెడు జరిగితే అది నీ దురదృష్టం వలనే అంటే దానికి కూడా బాధ్యత  వహించటానికి సిద్ధపడాలి.”

ఇది ఎపుడూ మనసులో అనుకునే మాట.

ఒకరి జీవితంలో జరిగే సంఘటనలకు వేరొకరిని అదృష్టవంతులు గానో,దురదృష్టవంతులు గానో చెబుతూ బాధ్యులను చేయటం న్యాయం కాదేమో అనిపిస్తుంది.

బహుశా నా చిన్నతనంలో నాన్న గారు చనిపోయాక,ఒకరిద్దరు నేను పుట్టిన తరువాతే ఆయన చనిపోయారు అనటం వలన మనసుకు కలిగిన బాధ ఇలా అనుకునేలా చేసిందేమో.

Leave a comment »

నేను చూసిన కొత్త పాత నోట్ల ముచ్చట్లు

500,1000 నోట్లు చెల్లవనే విషయం మొదట వాట్సాప్ మెసేజ్ చేరవేసింది.అది చదవగానే మొదట అర్ధం కాలేదు.టి.వి. లో చూడగానే దాని గురించి అర్ధమైంది.కొత్త వంద నోట్లు,చిన్న నోట్లు దాచుకునే సరదా నాకు ఉండటం వలన ఇంట్లో పెద్ద ఇబ్బందులు ఎదురు కాలేదు.నా బ్యాగ్ లన్నీ వెతికితే దొరికింది ఒకే ఒక ఐదు వందల నోటు.ఆశ్చర్యమేంటంటే అమ్మ,పెద్దమ్మ దగ్గర సీక్రెట్ గా దాచుకున్న డబ్బులు ఒక్కొక్కరి దగ్గర  దాదాపు పదిహేను ఇరవై వేలు బయటకి తీశారు.(అత్తమ్మ దాచుకున్న డబ్బు పాపం నా దగ్గర చూపలేదు నా దగ్గర నుంచి మామయ్య గారు కూపీ లాగుతారేమో అన్న అనుమానంతోనేమో.అత్తమ్మ  ఫోన్ చేసి పిలవటంతో మరుసటి రోజు మా ఆడపడుచు కి మా ఇంట్లో పనిపడింది.ఆ తరువాత మా ఆడపడచుకి బ్యాంకులో పని పడింది.😊).

                                            ఆ రోజు నుంచి మొదలయ్యాయి బ్యాంకులో అవస్థలు.అసలే జనానికి బ్యాంకు సిబ్బంది అన్నింటికీ చిరాకు పడిపోతారు అనే అభిప్రాయం మా మీద.అయినా అది జనాల తప్పు కాదు బయటి నుంచి అద్దాల లో నుంచి చూసే వారికి మేం హాయిగా కూర్చుని ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తాం మరి.మా కష్టాలను ఇప్పుడు మీకు చెప్పను లెండి.మీకు కష్టాలేముంటాయి అన్నట్లు అలా చిరాకుగా చూడకండీ.

                        రెండు వారాల నుంచీ ఎదురు చూసిన రెండో శనివారం,ఆదివారం సెలవులు లేవనేయటంతో వేరే ఊరిలో ఉద్యోగం చేస్తున్న మా వారి దగ్గరకు వెళ్లి తన పుట్టిన రోజు నాటికి తనతో ఉండాలనుకున్న నా కోరిక తీరకుండా పోతున్నందుకు బోలెడంత ఏడుపు లాంటి భావమేదో వచ్చేసింది.అయినా కూడా తన పుట్టిన రోజు ముందు రోజు బ్యాంక్ ముగిసాక బయల్దేరి అక్కడికి రాత్రి తొమ్మిదింటికి చేరి మళ్లీ తన పుట్టిన రోజు వేకువ ఝామున బయలు దేరి వచ్చేసాను.ఇక నా సంగతులు వదిలేద్దాం.

                                   నడవటానికి  కష్టమయ్యే  స్థితిలో ఉండి పేదవారిలా కనిపించే పెద్ద వయస్సు వారు కూడా ఒక్కొక్కరు యాభై వేలు అంత కంటే ఎక్కువ మొత్తాలు పూర్తిగా దుమ్ము ధూళి పట్టిన నోట్ల కట్టలు తెచ్చారు వాటి ధూళి వలన నాకు అప్పుడు మొదలైన జలుబు,తుమ్ములు ఇంకా తగ్గలేదు.లంచగొండి అధికారుల డబ్బు వాళ్ల  ఆఫీస్ లో పనిచేస్తున్న,రిటైరైన స్వీపర్ కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి చేరిపోయింది.చూస్తూ కూడా కొన్ని సార్లు ఏమీ చేయలేని పరిస్థితి.

                               కొత్త రెండు వేలు నోటు చూడగానే ఇదేంటి ఇలా ఉంది బాలేదు అని కొందరంటే,కొంతమంది ఆ నోటు అందుకోగానే కళ్ల కి అద్దుకుని ముద్దు పెట్టుకున్నారు.ఇన్ని రోజులలో చాలా మంది కోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.వారి దగ్గరున్న పాత నోట్ల ని కొత్త నోట్లుగా మార్చుకోవటం లో సహకరించలేదని పరిచయస్తుల నుంచి కోపాన్ని,ఎక్కువ కొత్త నోట్లు అందుబాటులో లేక అందరికీ ఎంతో కొంత డబ్బు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో తక్కువ డబ్బు మాత్రమే అకౌంట్ నుంచి తీసుకెళ్లమన్నందుకు ఖాతాదారుల కోపం భరించవలసి వచ్చింది.ఉదయం వేగం బ్యాంకుకు వెళ్లి రోజంతా జనాలతో తిట్లు తిని దాదాపు రాత్రి పడుకునే వేళకి ఇంటికి చేరే సరికి ఒంట్లోని శక్తి శూన్యమైపోతుంది.ఇంత అలసట లో కూడా అప్పుడపుడు ఇష్టమైన బ్లాగులు చదువుకున్నాను.ఇక ఉంటానండీ.

10 Comments »

ఈ మధ్య నాకు నచ్చిన కొన్ని ఫొటోలు

3 Comments »

మనసు వర్షించని మేఘమైనట్లు…

మురిపెంగా పెట్టుకున్న ముగ్గును మొత్తం ఎవరో కాలితో చెరిపేసినట్లు

ఇష్టం గా రాసుకున్న డైరీ పేజీలను ఎవరో కళ్ల ముందే కాల్చేస్తున్నట్లు

పుస్తకాల మధ్యలో ప్రేమగా దాచుకున్న నెమలికన్ను ని ఎవరో ముక్కలుగా చింపేసినట్లు

అమాయకంగా నవ్వే పసిదానికి ఎవరో అకారణంగా చెంపదెబ్బని బహుమతిగా ఇచ్చినట్లు

ఇష్టంగా తిరుగాడిన ఇంటిని ఎవరో కూల్చేసినట్లు

రోజూ ఆప్యాయంగా చూసుకునే  కిటికీ దగ్గరి మరువం మొక్కలను రంగుల పూలు పూయట్లేదనే కారణంతో ఎవరో తీసిపడేసినట్లు

అందంగా కుట్టటం పూర్తైన పూల దండ దారం తెగిపోయి పూలన్నీ చెల్లాచెదురుగా పడిపోయినట్లు

చక్కగా అలంకరించుకున్న కొండపల్లి బొమ్మలను ఎవరో విరిచి పడేసినట్లు

మెలకువ గా ఉండగానే ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లు

పగలు రాత్రి మనసుకి శూన్యం తప్ప ఇంకేమీ కనిపించనట్లు

విలువైన బంధపు దారం ఏక్కడో తెగేంతలా బలహీనపడుతున్నట్లు

5 Comments »