కొన్ని సినిమాలు చూసిన వెంటనే బాగున్నాయనిపిస్తాయి.కానీ ఒకరోజు గడిచే సరికి సినిమా గురించి మరచిపోతాం.ఇంకొన్ని సినిమాలు చూస్తుంటే మొదలైన అరగంటకే బయటకి వెళ్లిపోవాలనిపిస్తుంది.నిన్న ఆదివారం చెలియా సినిమా చూశాం.ఇద్దరికీ నచ్చింది.ఒకరోజు గడిచాక ఈ రోజుకి కూడా సినిమా బాగుంది కదా అనిపించింది.
మణిరత్నం గారి సినిమా అనగానే వెళ్లాలి అనుకున్నాం.(కడలి,విలన్ సినిమాలు భయపెట్టాయి అన్నది మాత్రం నిజం.)వెళ్లే ముందు రివ్యూలు చదివి సినిమా బాగులేదా అని చాలా నిరాశగా అనిపించింది.కానీ ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల వలన ఇలాంటి రివ్యూలు,రేటింగ్ లు నమ్మటం మానేశాం కాబట్టి ఆదివారం మధ్యాహ్నం చెలియా సినిమాకి వెళ్లాం కృష్ణ,నేను.అందరూ చెప్పినట్లుగా సినిమా చూస్తుంటే విసుగ్గా ఏం అనిపించలేదు.Armed forces నేపధ్యంలో సినిమా తీయటం వలనేమో ఇంకా బాగా నచ్చింది.మా ఇంట్లో ముగ్గురు ఆర్మీ ఆఫీసర్స్(ఒకరు మేజర్,ఇంకొకరు రిటైర్డ్ మేజర్,ఇంకొకరు కల్నల్) ఉండటం వలన,వీరి ముగ్గురిలో ఇద్దరు యుద్ధం సమయంలో పనిచేసి ఉండటం వలన, చిన్నప్పటి నుంచి త్రివిధ దళాలకు సంబంధించిన విషయాలు వింటూ,వాటికి సంబంధించిన ఫొటోలు చూస్తూ పెరగటం వలనేమో సినిమాలో కనిపించిన ఆర్మీ సంస్కృతి పరిచయమున్నట్లుగానే అనిపించింది.హీరో మొండి ప్రవర్తన విసుగ్గా,విచిత్రంగా అనిపించలేదు.పైగా సినిమా అంటే మరింతగా ఇష్టం పెరిగింది.నేను చూసినంత వరకు మణిరత్నం గారి సినిమాల్లో ఆర్మీ నేపధ్యం కనిపించినంత అందంగా ఇంకే సినిమాలో నాకు కనిపించలేదు.
“They are not heroines,they are characters,They all have a mind of their own.”అని మణిరత్నం గారు తన సినిమాల్లోని కధానాయిక పాత్రల గురించి చెప్పినట్లు మణిరత్నం సినిమాల్లోని హీరోయిన్లకు తమకంటూ బలమైన వ్యక్తిత్వం,సొంత ఆలోచనలు ఉంటాయి.చాలా వరకు ఆయన సినిమాల్లో గమనించినంత వరకూ ఆ కధానాయిక పాత్రల ప్రవర్తనను కట్టడి చేయాలని ప్రయత్నించే కుటుంబ సభ్యుల పాత్రలు అంతగా కనిపించవు ఆయన సినిమాలలో.ఈ సినిమాలో అదితీరావ్ హైదరీని చూస్తున్నంత సేపు కనులకు చాలా హాయిగా అనిపించింది.తన వస్త్రధారణ కూడా చాలా హుందాగా అనిపించింది.అసలు ఈ సినిమా నాకు నచ్చటానికి ఉన్న కారణాలలో కధానాయిక నటన,అందం అతి ముఖ్యమైనవి.తన స్నేహితురాలిగా నటించిన రుక్మిణి విజయకుమార్ కూడా బాగున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ ఇల్లు,ఆ ఇంటి అలంకరణ చాలా నచ్చింది.లొకేషన్స్ చాలా బాగున్నాయి.రవివర్మన్ గారి అత్యంత అందమైన కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే.ప్రతీ ఫ్రేమ్ అందంగా ఇంకా చూడాలనిపించేలా ఉంది.
ఎ.ఆర్.రెహమాన్ గారి నేపధ్య సంగీతం కొన్ని చోట్ల సన్నివేశాలకు మరింత అందాన్ని అద్దినట్లు అనిపించింది.రెండు పాటలు బాగున్నాయి.సినిమా అయిపోయాక నేను,కృష్ణ సినిమాకి 5/5 రేటింగ్ ఇచ్చేసుకున్నాం.ఆఫీసర్ వి.సి.,లీలా అబ్రహం పాత్రలు బాగున్నాయి కదా అనుకున్నాం.అందరూ ఇచ్చే రివ్యూలు,రేటింగ్ లు మాకు సరిపోవని నవ్వుకున్నాం.వచ్చేస్తుంటే ఎవరో ఇంకొకతనితో అంటున్నాడు”ఏ పిచ్చోడు రా ఈ సినిమా బాగుందని నీకు చెప్పాడు” అని.ఆ చెప్పినతను ఎవరో మన లాంటి వారే అని ఇంకోసారి నవ్వుకున్నాం.
బోలెడంత మేకప్ వేసుకుని కేవలం పాటలకు మాత్రమే పనికొచ్చే హీరోయిన్లు,చిన్న బట్టలు వేసుకున్న హీరోయిన్లు,అరగంట కొకసారి రక్తాలొచ్చేలా ఒకరే వంద మందిని కొట్టేసే ఫైట్లు,హాస్యం అంటూ ద్వంద్వార్ధపు మాటలు చూపించే వెకిలితనం ఇవేవీ కనిపించలేదు ఈ సినిమాలో.అందుకే హాయిగా అనిపించింది.
మణిరత్నం మ్యాజిక్ ఇలాగే ఉంటుంది ప్రత్యేకంగా,అందంగా,నిరాడంబరంగా,హాయిగా,కొంతమందికి మాత్రమే అర్ధమయ్యేలా(బహుశా మాలాంటి మణిరత్నం పిచ్చోళ్లకి మాత్రమే అర్ధమయ్యేలా.)