mahivishnupriya

నా భావాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం

పంతులు గారి ఇల్లు

on May 22, 2016

(అసలు ఈ పోస్ట్ నిన్ననే వ్రాయాలనుకున్నా.కానీ వారంలో ఒకరోజు స్మార్ట్ ఫోన్ వాడటం, ఇంటర్నెట్ వాడటం పూర్తిగా మానేయాలని నిర్ణయించుకుని నిన్న అమలుచేశాను.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీరు కూడా ఒకరోజు అలా చేసి చూడండి చాలా హాయిగా ఉంటుంది.)
కొంతమందికి కొన్ని ఇష్టం.వాటికి కారణం మాటల్లో చెప్పమంటే వివరించటం కష్టం.అలాగే నాకు ఇల్లు అంటే ఇష్టం.అర్ధం కాలేదా?మా ఇల్లంటే ఇష్టం.ఈ ఇష్టం తోనే ఉద్యోగం,పెళ్లి విషయంలో నిర్ణయాలు తీసుకున్నాను.ఇపుడు కంటే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు దూరప్రదేశాల్లో వస్తే వదులుకుని,దూరం బదిలీలు ఉండని ఈ ఉద్యోగం లోనే ఉండిపోయాను.విదేశాల్లో చదువుకుని వచ్చిన మా వారు అక్కడ ఉద్యోగావకాశాలు వచ్చినా వెళ్లలేదనేది నాకు అతనిలో నచ్చిన అంశాలలో ముఖ్యమైనది.పైగా వాళ్ల ఊరికి మా ఊరికి మధ్య దూరం పాతిక కిలోమీటర్లకు మించదు.అంటే మా ఇంటికి దగ్గరగా ఉండవచ్చు.
                    ఇక ఇల్లు అంటే ఇష్టం విషయానికొస్తే ఎవరిల్లైనా ఇష్టమే.ఇల్లంటే భౌతికంగా కనిపించే గోడలతో కూడుకున్నది మాత్రమే కాదు.ఇంట్లోని ప్రతి అణువణువుతోనూ ఆ ఇంట్లో వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది.ఇల్లంటే ఇష్టం అన్నాను కదా.ఇప్పటి లాంటి ఆధునికమైన డ్యూప్లెక్స్ ఇల్లు లాంటివి కావు.పాతకాలపు ఇల్లు.మరీ ముఖ్యంగా మండువా ఇల్లు.నాన్న వాళ్ల ఇల్లు నా చిన్నతనంలో నేను నాలుగవ తరగతి చదివే వరకు అచ్చంగా అలాంటి మండువా ఇల్లే.తరువాత వర్షాల్లో అది కూలిపోవటం, దాని స్ధానంలో వేరే పద్ధతిలో ఇల్లు కట్టడం జరిగిపోయినా అంతకుముందు ఉండే పాత మండువా ఇంటి రూపం ఇప్పటికీ నా కళ్ల ముందు సజీవంగా ఉంది.ఇలా మండువా ఇల్లంటే నాకున్న ఆరాధనా భావం(ఇది మీలో కొంతమందికి పిచ్చిలా అనిపించవచ్చు.అపుడు మీరు ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం అనే మాట గుర్తు తెచ్చుకోవాలి మరి.) నాతో పాటు పెరిగి పెద్దదయింది.ఇలా కాలం గడుస్తుండగా ఒకానొక వేసవికాలపు సెలవులలో(బహూశా ఏడవ తరగతి తరువాత అనుకుంటాను.) నేను మా మేనత్త వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల మామిడి తోటలు,జీడితోటల్లో ఆడుకుంటూ,తాటిముంజెలు, పనసతొనలు తింటూ,ఊరి చివర ఉన్న ఏరులో స్నానాలు చేస్తూ రెచ్చిపోతున్న రోజుల్లో మా మామయ్య ఏదో పని మీద ఏరు అవతల ఉన్న ఊరికి వెళుతూ  పిల్లలందరినీ తీసుకెళ్లారు.అదిగో ఆ ఊరిలో కనిపించింది ఆ ఇల్లు.అదే పంతులు గారి ఇల్లు అంటారంట ఆ ఇంటిని.చాలా పే…………ద్ద ఇల్లు.దాదాపు వందగదులుంటాయేమో(అప్పట్లో నాకు అలాగే అనిపించింది.ఎన్ని గదులో నాకు నిజంగా తెలియదు.)నాకు అందులో దూరిపోయి ఇల్లంతా తిరిగి చూడాలనిపించింది.కానీ ఇలాంటి కోరికలు చెబితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నోరు మూసుకున్నాను.మామయ్యా అందులో ఎంతమంది మనుషులుంటారు అని అడిగాను తెలియదమ్మా అన్నారు.అప్పటి నుంచి ఆ ఇంటిని చూడాలని రోజూ అనిపించేది.కానీ మళ్లీ ఆ ఇంటిని చూడటం కుదరలేదు.ఆ ఇల్లు ఎవరిది అనే విషయంతో నాకు సంబంధం లేదు ఆ ఇల్లంటే ఇష్టం అంతే.
              ఇన్నేళ్ల తరువాత నిన్న మళ్లీ విన్నాను ఆ ఊరి పేరు.నిన్న బ్యాంక్ లో లోన్ కోసం వచ్చి నా పక్క కౌంటర్ ముందు నిల్చున్నామె నోటి నుంచి.ఆ ఊరి పేరు వినగానే మంత్రం వేసినట్లు అక్కడకి వెళ్లిపోయాను.ఆమెని అడిగాను ఆ ఊరిలో ఒక పెద్ద ఇల్లు ఉండాలి ఎలా ఉంది ఆ ఇల్లు?బాగుందా? అని ఏదో చిన్ననాటి నేస్తం గురించి అడిగినట్టుగా.ఆమెకి నా ప్రశ్న ఆశ్చర్యంగా అనిపించినట్లుంది.ఆ ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ముసలివాల్లే ఉన్నారండీ. వాళ్ళ పిల్లలు ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు.ఆ ఇంట్లో చాలా వరకు పాడైపోయింది పాములు చేరిపోయాయండీ అని ఇంకా ఆమె ఏదో చెబుతుంటే ఇంకా వినేందుకు మనసు అంగీకరించలేదు.అప్రయత్నంగా అక్కడి నుంచి మిగిలిన మాటలు వినపడనంత దూరంగా నడచుకుని వెళ్లిపోయాను.
              కొంతకాలానికి పల్లెల్లో ఒకపుడు హుందాగా ఉండే ఇల్లు వారసులు లేని అనాధల్లా చిన్నబోతాయా? మా తరువాత తరాల వాళ్లు మేము ఇప్పుడుంటున్న ఇల్లు ని ఇలాగే వదిలి వెళ్లిపోరు కదా అనే భయం మనసుని ఆక్రమించేసింది.మా ఆటలు, నవ్వులు, అలకలు, కన్నీళ్లు,ఆశలు వీటన్నింటిలోనూ భాగంగా ఉన్న ఇల్లు కొంత కాలం తరువాత ఖాళీగా అయిపోనివ్వకు తండ్రీ అని దేవుడిని అప్రయత్నంగానే వేడుకున్నాను.వేటి మీదా మమకారం పెంచుకోకూడదు కాలంతో పాటు కొన్ని మార్పులు తప్పవు అని తెలిసినా దేవుడిని ఈ కోరిక కోరుకోకుండా మాత్రం నా మనసుని కట్టడి చేసుకోలేకపోయాను.
              పంతులు గారి ఇల్లు ఇప్పుడు ఎలా ఉన్నా నా ఙాపకాలలో మాత్రం చాలా గంభీరంగా,హుందాగా,అందంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

image

(ఫొటో గూగుల్ లో వెతికి తెచ్చుకున్నది.)


One response to “పంతులు గారి ఇల్లు

  1. Naga Muralidhar Namala says:

    రాష్ట్రంలో ఏ పల్లెలో చూసినా ఇంతేనండి. పాతకాలం నాటి ఇళ్ళు అయితే శిధిలమయిపోతున్నాయి లేదా మేడలుగా మారిపోతున్నాయి. ఇంకా ఊరిలోనే ఉందాం అని కోరుకుంటున్నవాళ్ళు ఎక్కడుంటున్నారు?

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: